అనుమానాస్పదంగా ఏనుగు మృతి
భువనేశ్వర్: అఠొగొడొ అటవీ శాఖ పరిధిలో ఏనుగు మృతి అనుమానాస్పదం అయింది. ఈ ప్రాంతంలోని నరసింగ్‌పూర్‌లో మృత ఏనుగుని గుర్తించారు. దీని వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఏనుగు కళేబరం పడి ఉన్న పరిసరాలు దృష్ట్యా విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణ కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం
● ఒకరు మృతి, నలుగురికి గాయాలు
భువనేశ్వర్: నగర శివారులో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు ఎక్కువగా ఉండడంతో వేగంగా దూసుకొచ్చిన కారు చెట్టుని ఢీకొని అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొంది. ప్రమాద తీవ్రతతో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. మృతుడు సునీల్ స్వంయిగా గుర్తించారు. గాయపడిన వారిలో రాజేష్ మహరణ, కాన్హు చరణ్ మల్లిక్, చందన్ మల్లిక్ మరియు సంగ్రామ్ రౌత్ ఉన్నారు. వీరంతా స్థానిక మంచేశ్వర్ ప్రాంతం మిక్చర్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిగా కనుగొన్నారు. భువనేశ్వర్, పూరీ జాతీయ రహదారి బైపాస్ సమీపం లింగిపూర్ దయానది వంతెనపై అర్ధరాత్రి 1.20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ధౌలి ప్రాంతంలో రాత్రి విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పూరీ నుంచి భువనేశ్వర్‌కు తిరిగి వస్తుండగా కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తక్షణమే బాధితులకు సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను సత్వర చికిత్స కోసం స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్సీబీ వైద్య బోధన అస్పత్రికి తరలించారు. ధౌలీ ఠాణా పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
వేడి కూర పడి విద్యార్థికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి మజ్జిగుడలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటొ తరగతి చదువుతున్న పోహన్ మహానందియా అనే విద్యార్థిపై వేడి కూర పడి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం నాడు చోటు చేసు కున్న ఈ సంఘటనకు సంబంధించి గాయాలపాలైన పోహన్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రతి రోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఈ పాఠశాలలో శనివారం నాడు భోజనం పంపిణీ చేసే క్రమంలో విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పోహన్ కిందపడిపోయాడు. అతడి మీద వేడి కూర పడింది. దీంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని మజ్జిగుడ ఆరోగ్య కేంద్రానికి తరలించిన అనంతరం నిర్వాహకులు పోహన్ తల్లిదండ్రులు రాధాకృష్ణ మహానందియా, లలితా మహానందియాలకు సమాచారం అదించారు. అక్కడ ప్రాథమిక వైద్యాన్ని అందించిన డాక్టర్ అనుభవ్ సాహు మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాలని విద్యార్థి తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు, నిర్వాహకులు సక్రమంగా ఉండకపోవడంతోనే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment