డ్యామ్ లీక్‌పై రైతుల ఆందోళన
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితిలోగల తెలింగిరి సాగునీటి డ్యామ్‌లో నీరు లీక్ కావటంపై అధికారులు తలలు పట్టుకోగా.. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ సీజన్‌లో నీరు అందబోదన్న వార్త చింత జయపురం, కొట్‌పాడ్, బొరిగుమ్మ సమితుల్లో 24 వేల మంది రైతులను పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ జలాశయంలో నీటి మట్టం తగ్గుతోంది. లీకేజీని అరికట్టే మార్గం కనుగొనాలని సోమవారం రైతులు చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ముట్టించారు. వెంటనే తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ మెమొరాండం సమర్పించారు. బొరిగుమ్మ సమితిలో 9 గ్రామ పంచాయతీ రైతులు కార్యాలయం ముట్టడించటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. డ్యామ్ లీకేజీని అరికట్టాలంటే మరమ్మతులు చేయాలి. అది జరగాలంటే నీరంతా ఖాళీ చేయాలి. అందుకు మార్గాలను ఇంజినీర్లు అన్వేషిస్తున్నారు. డ్యామ్ ఖాళీ చేయాలా లేదా మరో మార్గం చూపుతారా అన్నది ఉన్నతాధికారులు నిర్ణయంపైనే ఆధార పడి ఉన్నట్లు అదనపు చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ పాణిగ్రహి వెల్లడించారు. దీంతో రైతులకు ఎవరూ సంతృప్తికర సమాచారం ఇవ్వలేకపోయారు. గత శుక్రవారం ఆంధ్ర నుంచి వచ్చిన ఇంజినీర్ నిపుణులు డ్యామ్‌లో నీరు పూర్తిగా ఖాళీ చేసినప్పుడే డ్యామ్ లీకేజీని అరికటేందుకు మరమ్మతు పనులు సాధ్యమని స్పష్టం చేసినట్లు సమాచారం. అదే జరిగితే రబీ పంటలకు సాగు నీరు లభించదని అంటున్నారు. కోట్లాది రూపాయిల వ్యయంతో రైతుల భూములకు సాగునీరు సమకూర్చేందుకు నిర్మించిన తెలంగిరి డామ్ నిర్మాణం జరిగి ఐదేళ్లకే నీరు లీక్ కావటం నిర్మాణ లోపమేన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డ్యామ్ నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment