వికసిత ఒడిశా రూపకల్పనకు సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్ర అవతరణ శతాబ్ధి దగ్గర పడుతోంది. 2036 సంవత్సరంలో రాష్ట్రం శతాబ్ధి పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికసిత ఒడిశా ఆవిష్కరించాలని నడుం బిగించింది. సాధికారిత సాధన దిశలో సరికొత్త ఆశలు, సృజనాత్మక కార్య శైలి, అభివృద్ధి చెందిన సమాజం వంటి ఉన్నత దృక్పథ కార్యాచరణ రూపకల్పన కోసం సమాజంలో అన్ని వర్గాల నుంచి అమూల్యమైన అభిప్రాయాల్ని ఆహ్వానించింది. ఈ గడువుని మరి కొద్ది కాలం పొడిగించాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. లోగడ ప్రకటించిన ప్రకారం వికసిత ఒడిశా ఆవిష్కరణ ప్రతిపాదనల దాఖలు గడువు బుధవారం (ఈ నెల 20)తో ముగియాల్సి ఉంది. ఈ గడువుని డిసెంబరు నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ 2047కి సంబంధించిన మార్గదర్శకాల్ని ప్రజలు దాఖలు చేసేందుకు వీలవుతుందని ప్రకటించారు.
నీతీ ఆయోగ్ ప్రముఖ కార్యనిర్వాహక అధికారి సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ ఆవిష్కరణకు సంబంధించి ప్రజాభిప్రాయాల దాఖలు ఇతరేతర అనుబంధ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కమిషనరు అనూ గర్గ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయాల దాఖలు గడువుని పొడిగించినట్లు ప్రకటించారు. భావి అవసరాలు, సవాళ్లని దృష్టిలో ఉంచుకుని వికసిత్ ఒడిశా దార్శనిక (విజన్) పత్రం రూపకల్పన జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం సరికి సమాజంలో వివిధ వర్గాల నుంచి 15 వేల ప్రతిపాదనలు దాఖలైనట్లు అభివృద్ధి కమిషనరు తెలిపారు. డిసెంబరు నెల 5వ తేదీ వరకు ప్రతిపాదనల్ని దాఖలు చేసేందుకు వీలు అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా దాఖలు చేసేందుకు వీలు కల్పించారు. 63709–51920 నంబర్‌కు సూచనలు వాట్సాప్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment