ధర్మశాలలో ఉద్రిక్తత
భువనేశ్వర్: జాజ్‌పూర్ జిల్లా ధర్మశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, భారతీయ జనత పార్టీ నాయకుడు హిమాంశు సాహు (లిక్కు)పై బుధవారం దాడి జరిగింది. విపక్ష బిజూ జనతా దళ్ వర్గీయులు, ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాష్ దాస్ (బాబి) సోదరుడు తన అనుచరులతో పాల్పడినట్లు ఆరోపణ. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలు వెల్లడించేందుకు పోలీసు వర్గాలు నిరాకరించాయి.
ఈ సంఘటన పూర్వాపరాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసు విభాగం 3 ప్రత్యేక బృందాల్ని నియమించింది. పోలీసులు పలు చోట్ల నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆకస్మిక అవాంఛనీయ దాడుల నివారణ నేపథ్యంలో ధర్మశాల టౌన్ పోలీసు ఠాణా ఆవరణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టరు జనరల్ సంజయ కుమార్ జాజ్‌పూర్‌లో డేరా వేశారు. ప్రత్యేకంగా సమస్యాత్మక జాజ్‌పూర్ సదరు, జాజ్‌పూర్ టౌన్ పోలీసు ఠాణాలకు ప్రత్యేక భద్రత కల్పించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో కొనసాగుతుందని ఏడీజీ సంజయ్ కుమార్ తెలిపారు. ధర్మశాల నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హిమాంశు సాహుపై జాజ్‌పూర్ బుడాఘాట్ ప్రాంతంలో బుధవారం దాడి జరిగింది. ఇదంతా విపక్ష బిజూ జనతా దళ్ వ్యూహమని ప్రభావిత ఎమ్మెల్యే బాహాటంగా ఆరోపించారు. విపక్షం వ్యూహం బెడిసి కొట్టడంతో తనకు ప్రాణాలు దక్కాయి. తనను హతమార్చి త్వరలో ఉప ఎన్నిక నిర్వహణ కోసం ఈ వ్యూహం రచించి దాడికి పాల్పడ్డారని ధర్మశాల నియోజక వర్గం ఎమ్మెల్యే హిమాంశు సాహు ఆరోపించారు. దాడి జరిగిన కాసేపటి తర్వాత మాజీ ఎమ్మెల్యే బబ్బీ దాస్ సోదరుడు లల్లా దాస్ ఫోను చేసి ‘అయిపోంది ఏదో అయిపోయింది.. సర్దుకు పోదాం’ అని ఫోన్ చేయడం విపక్ష కుట్రగా స్పష్టం చేస్తుందని ఆయన వివరించారు. దాడిలో ఎమ్మెల్యే వ్యక్తిగత అంగ రక్షకుడు (పీఎస్‌ఓ) నుంచి తుపాకీ బలవంతంగా లాక్కునేందుకు ఆగంతకులు విఫలయత్నం చేశారు. తుపాకీ చిక్కి ఉంటే ప్రాణాలు తీసేసి ఉండే వారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తన కారు దెబ్బతిందని వివరించారు. బిజూ జనతా దళ్ అహింసావాదంపై విశ్వాసంతో మనుగడ కొనసాగిస్తుందని, హింసకు పాల్పడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాష్ దాస్ ప్రకటించారు. బాధిత ఎమ్మెల్యే ఆరోపణ తేవడంతో తక్షణమే తన సోదరునికి పోలీసు ఠాణాకు పంపించి ఆరోపణ వాస్తవాస్తవాలు తేలేంత వరకు అక్కడనే ఉండమని ప్రోత్సహించి పంపినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయంలో నిష్పక్షపాతంగా పారదర్శకతతో విచారణ చేపట్టి నిజమైన నిందితుల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యర్థించారు. దాడికి పాల్పడిన వారి వ్యతిరేకంగా తగిన చర్యలు చేపట్టడంలో తన వంతు పూర్తి సహకారం అందజేస్తానని చెప్పారు. గత బిజూ జనతా దళ్ సంకల్పించిన పలు ప్రాజెక్టుల్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి ప్రజల్ని బురిడీ కొట్టిస్తుందనే ఆరోపణతో స్థానిక అధికార, విపక్ష వర్గాల మధ్య గత కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఇంతలో విరజా ప్రాజెక్టు స్థాన మార్పు వివాదంతో ఆందోళనకు దిగిన వర్గీయులు ఎమ్మెల్యే వాహనంపై దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఎమ్మెల్యేపై దాడి: 10 మంది నిందితుల అరెస్టు
భువనేశ్వర్: జాజ్‌పూర్ జిల్లా ధర్మశాల నియోజక వర్గం ఎమ్మెల్యే హిమాంశు శేఖర్ సాహుపై దాడి కేసులో గురువారం 10 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరందర్ని జాజ్‌పూర్ సబ్ డివిజినల్ జుడిషియల్ మేజిస్ట్రేటు (ఎస్‌డీజేఎం) న్యాయ స్థానంలో ప్రవేశ పెట్టారు. వీరి అభ్యర్థన మేరకు బెయిలు మంజూరు చేసేందుకు న్యాయ స్థానం నిరాకరించడంతో జైలుకు తరలించారు. ఈ దాడిలో మిగిలిన నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. సుమారు 15 మంది వ్యక్తులు ఎమ్మెల్యే, అతని వ్యక్తిగత అంగ రక్షకునిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణ.
సిట్టింగ్ ఎమ్మెల్యేపై దాడి
మాజీ ఎమ్మెల్యే వర్గీయుల వ్యూహం
గట్టి పోలీసు నిఘా
Comments
Please login to add a commentAdd a comment