మౌలిక సదుపాయాలు కల్పించరూ..?
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి మునిఖాల్ పంచాయతీ పరిధి గుంజాపాయి గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. నియమగిరి పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో 30 డొంగిరియా తెగకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నారు. సుమారు 150 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో పాటు విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. డొంగిరియా తెగ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డొంగిరియా కొంధొ డవలప్‌మెంట్ ఏజెన్సీ(డీకేడీఏ) సంస్థకు ప్రతీ ఏడాది డొంగిరియా గ్రామాల అభివృద్ధికి కొట్లాది రుపాయుల నిధులు మంజూరవుతున్నా, ఇప్పటికీ ఇటువంటి అభివృద్ధి జాడలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయనే చెప్పవచ్చు. సమితి కేంద్రానికి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామంలో అధికారులు ఇంతవరకు కాలుపెట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వాగులో నుంచి వస్తున్న నీరే వీరికి శరణ్యమవుతోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందంచి, తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment