దేవదత్త.. స్ఫూర్తి ప్రదాత
కొరాపుట్: తాను చనిపోతూ మరో పది మంది బతుకుల్లో వెలుగులు నింపాడో యువకుడు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని గౌతం నగర్ 4వ లైన్‌కి చెందిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి ప్రతిప్ పాత్రో, సుప్రభా నాయక్ రెండో కుమారుడు దేవదత్త పాత్రో (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. వెంటనే సహచరులు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు వెళ్లారు. కానీ దేవదత్త బతకడని, బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ప్రకటించారు. ఇదే సమయంలో అవయవదానం కోసం వైద్యులు తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా.. వారు అంత బాధలోనూ ఒప్పుకున్నారు. దీంతో వెంటవెంటనే రెండు కళ్లు, రెండు కిడ్నీలు, గుండె, లివర్, చర్మం తీసి పలు ఆస్పత్రులకు తరలించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ రద్దు
● హై కోర్టులో వ్యాజ్యం దాఖలు
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర మహిళా కమిషను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మహిళా కమిషను అధ్యక్షురాలు ఇతర సభ్యుల్ని తొలగించింది. ఈ చర్యని సవాలు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో వ్యాజ్యం దాఖలైంది. ప్రాథమిక విచారణ చేపట్టిన ధర్మాసనం వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబరు నెల 11వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఈలోగా మహిళా కమిషన్‌కు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయ స్థానం తెలియజేసింది. మహిళా కమిషను కార్యాచరణ సంతృప్తికరంగా లేనట్లు భావిస్తే సంబంధిత కార్యాచరణ పరిశీలన పత్రాల్ని ధర్మాసనానికి దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన తాఖీదుల్లో స్పష్టం చేయడం విశేషం. కమిషను రద్దుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్ని సవాలు చేసి ముగ్గురు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వీరిలో బిజయ్ బరువా, స్వర్ణలత సామల్ మరియు బబిత స్వంయి ఉన్నారు.
దోమ తెరల పంపిణీ
రాయగడ: మలేరియా, డెంగీ నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సదరు సమితి జిమిడిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలోని బాయిసింగి గ్రామంలో దోమ తెరల పంపిణీ కార్యక్రమం గురువారం చేపట్టారు. కార్యక్రమంలో బీడీవో అమూల్య కుమార్ సాహు, పీహెచ్‌సీ అదనపు ఆరోగ్య శాఖ అధికారి భోగి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మలేరియా, డెంగీ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిద్రించే సమయంలో దోమ తెరలు వినియోగించాలని డాక్టర్ సంతోష్ కుమార్ సూచించారు. కొన్ని ప్రాంతాల్లో అవగాహన రాహిత్యంతో దోమ తెరలను ఇతరత్ర పనులకు దుర్వినియోగం చేస్తుండటం సరికాదన్నారు.
రాష్ట్రంలో మహిళా న్యాయస్థానం: మంత్రి
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్లు న్యాయ శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచారాలు వంటి నేరాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధిత వర్గాలకు సత్వర న్యాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా న్యాయ స్థానం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. మహిళలపై జరుగుతున్న నేర సంబంధిత కేసుల్ని ఈ న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని మంత్రి వివరించారు.
అంతా మహిళలే
మహిళా న్యాయ స్థానంలో న్యాయమూర్తి, ప్రభుత్వ న్యాయవాదులు, సిబ్బంది అంతా మహిళలే ఉంటారని మంత్రి ప్రకటించారు. ఫాసు్ట్రటాక్ కోర్టు తరహాలో మహిళా న్యాయ స్థానం సేవలు అందిస్తుంది. బాధిత మహిళా వర్గాలకు సత్వర న్యాయం కల్పించేందుకు త్వరిత గతిలో కేసుల విచారణ ముగిస్తుంది. దీంతో నిందితులకు సకాలంలో శిక్షలు ఖరారు చేయడం సాధ్యం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
చట్టపరమైన సంప్రదింపులు
రాష్ట్రంలో ప్రత్యేక మహిళా న్యాయ స్థానం ఏర్పాటు పురస్కరించుకుని చట్టపరమైన సంప్రదింపులు చురుకుగా సాగుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుతో సంప్రదింపులు చేస్తుంది. మహిళా న్యాయస్థానం ఏర్పాటు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment