ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో చేపలపెంపకం దార్లకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని, ముఖ్యమంత్రి కల్యాణ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్‌లో కలెక్టర్ బిజయ కుమార్ దాస్ జ్యోతిని వెలిగించి మత్స్య దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా ముఖ్య ప్రాణిచికిత్స అధికారి డాక్టర్ తుషార్ రంజన్ సాహు, జిల్లా ముఖ్యవ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ పాత్రో, జిల్లా ఉద్యానవనాల డిప్యూటీ డైరెక్టర్ సుశాంత రంజన్ దాస్, సెంచూరియన్ వర్సిటీ ఫిషరీస్ శాఖ అసిస్టెంటు డీన్ సంబిత్ స్వయిని, లీడ్ బ్యాంకు మ్యానేజరు మహేశ్వర మండళ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. జిల్లాలో గుమ్మా, కాశీనగర్, మోహనా, గుసాని ప్రాంతాల్లో అనేక పంచాయతీల్లో చేపల పెంపకంతో పాటు చెరువు గట్లపై నాటుకోళ్ల ఫార్మ్‌లు కూడా పెంచుతున్నారని, ఇది చాలా లాభదాయకమైన సమీకృత వ్యవసాయ విధానమని కలెక్టర్ దాస్ అన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి లిసా బెహరా మాట్లాడుతూ, జిల్లాలో అనేక మంది మహిళా గ్రూపులు చేపల పెంపకం ద్వారా జీవనోపాధిని పెంపొందించుకుంటున్నారని అన్నారు. మోహన బ్లాక్ హారభంగి డ్యామ్ వద్ద జూన్ నుంచి సెప్టెంబరు వరకూ చేపపిల్లల బ్రీడ్ తయారవుతుందని అన్నారు.ఐదేళ్లు చేపల పెంపకం సక్రమంగా జరిపితే వారికి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని జిల్లా మత్స్య అధికారి బెహారా అన్నారు. పీఎం మత్స్య యోజన పథకంలో కూడా మహిళా గ్రూపులకు ఐస్‌బాక్స్‌లు, వలలు, ఆటోలు సబ్సిడీపై అందజేస్తామని అమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని నువాగడ బ్లాక్ శోభాని మండళ్, గుమ్మా, రాయగడ బ్లాక్ మహిళా గ్రూపులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment