బీజేపీ సమావేశం రసాభాస
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ ఐబీ సమావేశ మందిరంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ అధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కార్యకర్తలు నాయకులపై విరుచుకుపడడంతో సమావేశం సగంలోనే ముగిసిపోయింది. సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి సరోజ్ కర్, పూర్ణిమ నాయక్‌లు కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా అసభ్య పదజాలంతో కార్యర్తలు ఆ పార్టీ సీనియర్ నాయకులపై విరుచుకుపడ్డారు. జిల్లాలోని రాయగడ, బిసంకటక్, గుణుపూర్ శాసనసభల్లో పార్టీ పరాజయానికి పార్టీ నాయకులే కారణమని కార్యకర్తలు దుమ్మెత్తిపోశారు. వ్యక్తిగత స్వార్థాల కారణంగా పార్టీ జిల్లాలో అథోగతిపాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను చిన్నచూపు చూడడంతోనే గత ఎన్నికల్లో పార్టీకి ఇక్కడ చేదు అనుభవం ఎదురయ్యిందని దుయ్యబట్టారు. గుణుపూర్ శాసనసభ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నాయకుడు త్రినాథ్ గొమాంగో ఇదే తరహా పార్టీలో కొనసాగితే పార్టీ మనుగడ పూర్తిగా కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత స్వార్థాలకు తావివ్వకండి
పార్టీ కార్యకర్తలతో సమావేశమైన రాష్ట్ర శాఖ కార్యదర్శి సరోజ్ కొరొ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లకు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీపై ప్రజలకు ఎంతో నమ్మకం కుదిరిందన్నారు. ఆ నమ్మకాలను స్వప్రయోజనాల కోసం వమ్ము చేయకూడదని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు. పార్టీలో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment