పునరావాసం కల్పించండి ప్లీజ్
జయపురం: తమకు పునరావాసం కల్పించాలని జయపురంలో రోడ్డు సైడ్‌లలో కాయకూరలు అమ్ముకునే గ్రామీణ మహిళలు మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తాము ముప్పై ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నామని, ఇటీవల ఆక్రమణలు తొలగించడంతో తాము ఉపాధి కోల్పోయామని తెలిపారు. ఎంజీ రోడ్డు తర్వాత మెయిన్ రోడ్డు వెడల్పు చేస్తారని అంటున్నారని, దైనిక బజారులో సిమ్మెంట్ దిమ్మలు ఏర్పాటు చేసి వాటిపై వ్యాపారం చేసేందుకు తమకు అనుమతించాలని వారు కోరారు. అలా తమకు పునరావాసం కల్పిస్తే రోడ్డు పక్కల కాయకూరలు అమ్ముకొనే సమస్య ఉత్పన్నం కాదని పొతి మాలి, రొయిమతి మాలి, సుకలదేయి పాయిక, చంపా మాలి తదితరులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో భర్త
మృతి
● భార్యకు గాయాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న వంశధార బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుణుపూర్ సమీపంలోని చిన్న విక్రమపూర్ గ్రామానికి చెందిన లిటిలి రాజ (30) తన భార్య సరితలు బైకుపై వెళుతున్న సమయంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ కింద పడిపొయారు. తలకు బలమైన గాయం కావడంతో లిటిలి అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్య సరిత గాయాలకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన సరతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
పట్టణ విద్యార్థుల గ్రామ సందర్శన
జయపురం: పట్టణ విద్యార్థులకు పల్లెల వాతావరణం, ప్రజల జీవన శైలి ఆచార వ్యవహారాలపై అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు జయపురం అరవిందనగర్ సరస్వతీ శిశు మందిర పాఠశాల నిర్వాహకులు. ఆ పాఠశాల విద్యార్థులకు ఆదివా రం జయపురం సమితిలో రెండు గ్రామాలకు తీసుకెళ్లి గ్రామాల వాతావరణాన్ని చూపించారు. గ్రామాలలో పర్యావరణం, గ్రామ ప్రజల జీవన విధానంపై విద్యార్థులలో అవగాహన కలగించటమే ఈ కార్యక్రమం ప్ర ధాన ఉద్దేశమని పాఠశాల ప్రధాన ఆచార్యులు డాక్టర్ రమణీరంజన్ దాస్ సోమ వారం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు గొడొపొదర్ గ్రామ పంచాయతీ దుబులి, ఎక్టాగుడ గ్రామాలకు తీసుకెళ్లి పంట పొలాలు, పంటలు పండించే విధానం, సాగునీరు, వరిచేను కోతలు, ధాన్యం చేను కుప్పలు వేసే కల్లాలు చూపించామన్నారు. గ్రామాలలో మట్టిగోడలతో కట్టిన ఇల్లు, వరిగడ్డితో నేసిన ఇంటి కప్పులు, కట్టెలతో మహిళలు వంటలు చేసేవిధానం, గ్రామీణ పిల్లల జీవన విధానంపై అవగాహన కలిగించినట్టు ప్రధాన ఆచార్యులు రమణీ రంజన్ దాస్ వెల్లడించారు. గ్రామాలు ఎలా ఉంటాయో తెలియని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసి గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment