మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన పైడిరాజు
సాలూరు రూరల్: ఈ నెల 14,15 తేదీలలో గుడివాడలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అద్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున పాల్గొన్న సాలూరు మండలంలోని మామిడిపల్లికి చెందిన పైడిరాజు 800 మీటర్లు, 400మీటర్లు, 400 రిలే పరుగుపందెంలో సత్తాచాటి బంగారు పతకాలు సాధించినట్లు పీఈటీ శ్రీరాములు తెలిపారు. ఆమె గీతం యూనివర్సిటీ డెంటల్ కళాశాలలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్నారు. ఆమె విజయం పట్ల మామిడిపల్లి గ్రామపెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
బొండపల్లి: మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి26పై బుధవారం ఉదయం ద్విచక్రవాహన చోదకుడిని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం వైపు నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి తన వివరాలు చెప్పలేని పరిస్థితిలో ఉండడంతో గజపతినగరంలోని సీహెచ్‌సీకి ఎస్సై యు.మహేష్ తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా సూర్యోదయానికి ముందు ప్రాతఃకాలార్చన, బాల భోగం, శ్రీ గోదాదేవి పల్లకిసేవ, తదితర కార్యక్రమాలను జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం జరిపించి, రామాయణంలో పట్టాభిషేక సర్గ హవనం చేసి పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మండలంలోని బాలగుడబ గ్రామానికి చెందిన ఆమిటి సతీష్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై పార్వతీపురం జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సతీష్‌కు పైళ్లె 14సంవత్సరాలైంది. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి అలవాటు పడడంతో ఎప్పటికప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్య 5సంవత్సరాల నుంచి పిల్లలతో కన్నవారింట్లో ఉంటోంది. ఎన్నిసార్లు కబురు పంపినా, పెద్దలతో పిలిపించినా నోటీసులు ఇచ్చినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెంది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇంటిమేడపైకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా రు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పార్వతీపురం కోర్టు మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం తీసుకుని వివరాలు నమోదు చేసినట్లు అవుట్‌పోస్టు ఏఎస్సై నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు.
బైక్ బోల్తా పడి మహిళ మృతి
బొబ్బిలి: పట్టణంలోని పాత బొబ్బిలి జంక్షన్ వద్ద బుధవారం రాత్రి బైక్ బోల్తా పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ మేరకు ఏఎస్సై జి.భాస్కర రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం కాశీపేటకు చెందిన దుప్పాడ ఉషారాణి(49)తన కుమారుడు అజయ్‌చందుతో కలిసి దత్తిరాజేరు మండలంలోని మరడాంలో బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా పాత బొబ్బిలి వద్ద ఉన్న రోడ్డుపై గుంతల వద్ద బోల్తా పడ్డారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమైన ఉషారాణిని బొబ్బిలి సీహెచ్‌సీకి అక్కడి నుంచి విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చెప్పారు.
భక్తి శ్రద్ధలతో కాకడ హారతి
బొబ్బిలి: పట్టణంలోని సింగారపు వీధిలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా మూడో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజారులు కాగడ హారతితో ఆలయ ప్రదక్షిణలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment