యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల అధారంగా పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా విధానాలను రుపొందించాలని కలెక్టర్ బీఆర్.అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పండించే వరి, మామిడి, మొక్కజొన్న వంటి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను అధారం చేసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై జనవరి మొదటి వారంలో పారిశ్రామిక సదస్సు నిర్వహించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తల్లో అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా మేనేజర్ ప్రశాంత్‌కుమార్, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.
బీచ్‌లలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి
జిల్లాలోని చింతపల్లి, చేపల కంచేరు, ముక్కాం బీచ్‌లలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ మత్య్సశాఖ డీడీని ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతపల్లి మైరెన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు బీచ్‌లు ఉన్నాయని, ఆదివారాలు, మరి కొన్ని ప్రత్యేక రోజుల్లో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారని, ఆ బీచ్‌ల వద్ద గజ ఈతగాళ్లు ఉండాల్సిన అవసరం ఉందని మైరెన్ ఎస్పీ రవి వర్మ కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కలెక్టర్ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చెల్లించేందుకు అవకాశం ఉందని, నెలలో నాలుగు రోజులు బీచ్‌ల వద్ద పనిచేయడానికి గజ ఈతగాళ్లను గుర్తించాలని సూచించారు. సమావేశంలో మైరెన్ అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డీపీఓ వెంకటేశ్వర రావు, మత్య్సశాఖ డీడీ నేతల నిర్మలాకుమారి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల మెడికవర్ ఫ్యామిలీ కార్డ్‌ను
ప్రారంభించిన కలెక్టర్
తిరుమల మెడికవర్ ఆస్పత్రి వారు అందించే వైద్య సేవలకు సంబంధించిన ఫ్యామిలీ కార్డును కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ బుధవారం ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎం.డి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ రూ.500తో ఏడాది పాటు ఐదుగురు సభ్యులు వైద్యసేవలు పొందవచ్చన్నారర. ఓపీ సంప్రదింపులపై 25 శాతం, ఓపీ పరిశోధనలపై 15 శాతం, నగదు ప్రవేశాల కోసం ఐపీ, డేకేర్ సేవలపై 10 శాతం తగ్గింపు ఉంటుందని తెలిపారు. బీమా రోగులకు వైద్యేతర సేవలపై 50 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. రూ.5 వేల కంటే ఎక్కువ ఉన్న ఫార్మసీ బిల్లుపై 20 శాతం తగ్గింపు ఉంటుందని వివరించారు.
కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment