అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పార్వతీపురం: ప్రజలనుంచి వచ్చిన అర్జీలపై అశ్రద్ధ చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లో గృహ నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను స్థానికంగానే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలోనే ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌ను విధిగా నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సక్రమంగా సరుకులు పంపిణీ చేయకపోతే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుని తొలగించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, సంచుల కొరతలేకుండా చూడాలని చెప్పారు. గృహనిర్మాణాల పనితీరు ఆధారంగా అఽధికారులకు గ్రేడ్‌లు ఇవ్వాలని తెలిపారు. జియ్యమ్మవలస మండలంలో పీఎం జన్‌మన్ ప్రగతి మందగమనంలో ఉండటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నెల కనీసం 500 ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రణాళికలు చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్.శోభిక, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఇంజినీరింగ్ అధికారి వీఎస్.నగేష్ బాబు, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్ తదితరులున్నారు.
కాఫీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో కాఫీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాచిపెంట మండలం శతాబి వద్ద కాఫీ క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలున్నాయని, పొలం గట్లుపై ఆదాయం సమకూరే అంతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కూరగాయల విత్తనాలు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. జనవరి నుంచి రైతు అవగాహన సదస్సులను నిర్వహించాలని, ఉద్యాన పంటలలో 15 శాతం వృద్ధి ఉండేలా ప్రణాళికలు చేయాలని తెలిపారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కేజ్ కల్చర్ ఏర్పాటుకు, మత్స్య ఉత్పాదక సంస్థ ఆద్వర్యంలో మత్స్య ఆహర యూనిట్లును ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నగరవనం, నగర వాటిక అభివృద్ధికి కృషిచేయాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి జీఏపీ.ప్రసూన, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్, జిల్లా పశుసంవర్థక అధికారి మన్మథరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment