సఫాయి కర్మచారులకు పునరావాసం కల్పించాలి
● జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు పీపీ వావా
పార్వతీపురం: సఫాయి కర్మచారి (పారిశుధ్య కార్మికులు)లకు పునరావాసం కల్పించాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు డా.పీపీ వావా అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న ప్రయోజనాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సఫాయి కార్మికులకు పునరావాసం కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని సూచించారు. ష్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. సఫాయి కర్మచారీల కుటుంబసభ్యులకు వివిధ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సఫాయీ కర్మచారి ప్రమాదశాత్తు మృతిచెందితే తక్షణం కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికుల ఆదాయాలకు అతీతంగా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులను మంజూరుచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు వావాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్.శోభిక, అదనపు ఎస్పీ డా.ఒ.దిలీప్ కిరణ్, డీపీఓ టి.కొండలరావు, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, జిల్లా కార్మిక శాఖాధికారి కె.రామకృష్ణారావు, డీడీఓ రమేష్ రామన్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసరాజు, సర్వేశ్వరరావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment