గిరిజన మ్యూజియం అద్భుతం
● ఒకేలా గిరిజనుల ఆచార వ్యవహరాలు ● కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం ● ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడా ● గిరిగ్రామ దర్శినిలో గిరి మహిళల చీరకట్టుతో సందడి
అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతిమలతో ఏర్పాటుచేసిన గిరిజన మ్యూజియం అద్భుతమని ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడా పేర్కొన్నారు. ఒడిశాలో పర్యాటకరంగ అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు బుధవారం ఆమె ప్రత్యేక హెలికాప్టర్‌లో అరకులోయ విచ్చేశారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఆమె ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అరకులోయ ప్రాంత గిరిజనుల సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని గిరిజనుల ఆచార వ్యవహారాలు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడి మాదిరిగానే తమ రాష్ట్రంలోని కాఫీ రైతులకు సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు.అక్కడ ఏర్పాటు చేసిన కెనాఫీ వాక్ బ్రిడ్జిను తిలకించిన ఆమె అటవీ సిబ్బందిని అభినందించారు. అరకులోయలోని కాఫీ మ్యూజియాన్ని సందర్శించారు. అరకు కాఫీ రుచి చూశారు. గిరిజన మ్యూజియాన్ని తిలకించారు. ఇక్కడి గిరిజనుల సంప్రదాయ ప్రతిమలతోపాటు గిరి మహిళలు థింసా నృత్యం చేస్తున్నట్టుగా ఉన్న ప్రతిమ వద్ద ఫొటో తీసుకున్నారు. అనంతరం పెదలబుడు పంచాయతీలోని గిరిగ్రామ దర్శినిని సందర్శించారు. ఆమెకు గిరి మహిళలు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. వారితో కలిసి నృత్యం చేశారు. అనంతరం గిరి మహిళల చీరకట్టుతో సందడి చేశారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఇళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో కోరాపుట్ జిల్లా కలెక్టర్ వి. కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ వర్మ, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పాల్గొన్నారు. పాడేరు డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో అరకులోయ సీఐ ఎల్.హిమగిరి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment