39 వేల గంజాయి మొక్కలు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని గుడారి సమితి రంభీ అటవీ ప్రాంతంలో గంజాయి సాగుపై పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న 39 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసి వాటిని తగుల బెట్టారు. జిల్లా ఎస్‌పీ శ్వాతీ ఎస్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఇటీవల కాలంలో గంజాయి సాగుపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు.
గుప్తేశ్వర్ శివ పీఠం ఉన్నతికి సిద్ధం
జయపురం: కొరాపుట్ జిల్లాలోని ప్రసిద్ధ శివక్షేత్రం గుప్తేశ్వర్‌ని సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒడిశా రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. రెవెన్యూ మంత్రి బుధవారం జయపురం సబ్‌డివిజన్‌లో పర్యటించిన సందర్భంగా గుప్తేశ్వర పీఠాన్ని దర్శించుకున్నారు. ఆయన గుప్తేశ్వర్ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమస్యలు గుర్తించి ఒక స్వతంత్య్ర మాస్టర్ ప్లాన్ సమర్పిస్తే అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పూజారితో పాటు నవరంగపూర్ ఎంపీ బలభధ్ర మఝి, కొరాపుట్ ఎమ్మెల్యే బలభధ్ర మఝి, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భోత్ర, బొయిపరిగుడ బిడిఒ అభిమణ్య కవి శతపతి, తహసీల్దార్ స్నిగ్ధ చౌదురి నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి నరేంధ్ర కందాలియ, బీజేపీ మండల అద్యక్షులు ఉమేష్ కుమార్ పట్నాయిక్, చంద్ర శేఖర రథ్, లలిత పూజారి, నటబర పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
కొరాపుట్, జయపురం జయకేతనం
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ ప్రథమ క్రికెట్ టోర్నమెంట్‌లో నాల్గో రోజు కొరాపుట్ కళాశాల, జయపురం విశ్వవిద్యాలయ టీమ్‌లు విజయం సాధించాయి. నాల్గో రోజున జరిగిన తొలి మ్యాచ్‌లో కొరాపుట్ ప్రభుత్వ కళాశాల టీమ్ గుణుపూర్ కళాశాల టీమ్‌తో తలపడింది. టాస్ గెలిచి కొరాపుట్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుణుపూర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆ జట్టులో బి.రంజిత్ 40 పరుగులు చేయగా దీపక్ 33 పరుగులు చేశారు. 153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కొరాపుట్ కళాశాల టీమ్ అతి సునాయాసంగా గుణుపూర్ టీమ్ ను 9 వికెట్లతో ఓడించింది. ఒకే ఒక వికెట్ కోల్పోయి 12.3 ఓవర్లలో 156 పరుగులు చేసి ఘనవిజయం సాదించింది. ఆ జట్టు ఆటగాడు నితీష్ కుమార్ 62 పరుగులు, భాస్కర్ 36 పరుగులు చేసి టీమ్ విజయానికి దోహద పడ్డాయి. రెండో మ్యాచ్‌లో సెమిలిగుడ ప్రభుత్వ కళాశాల టీమ్, జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ టీమ్‌లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సెమిలిగుడ కళాశాల టీమ్ ఫీల్డింగ్ ఎంచుకొంది. బ్యాటింగ్ ప్రారంభించిన విశ్వవిద్యాలయ టీమ్ 19.5 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటైంది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సెమిలిగుడ కళాశాల టీమ్ 16.2 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment