రసూల్‌గఢ్ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్టు
భువనేశ్వర్: స్థానిక రసూల్‌గఢ్ స్క్వేర్ సమీపంలో బుధవారం జరిగిన యువకుడి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ హత్య సంఘటనలో నిందితుల సంఖ్య 5కి పెరిగింది. ఈ విషయాన్ని నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పినాక్ మిశ్రా గురు వారం తెలిపారు. ఈ హత్యా సంఘటనలో పోలీసు వలంటీర్ సహదేబ్ నాయక్ (36) మృతునిగా గుర్తించిన విషయం తెలిసిందే. అరెస్టయిన నిందితుల్లో కేదార్‌పల్లికి చెందిన లక్కీ అలియాస్ లక్ష్మి నాయక్, రాకేష్ నాయక్ అలియాస్ ఒండాగా ఉన్నారు. ఈ హత్య సంఘటన నగరంలో తీవ్ర సంచలనం రేపింది. నిందితుల్ని స్వల్ప నిడివిలో అరెస్టు చేయాలనే దృక్పథంతో 3 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపినట్లు డీసీపీ పినాక్ మిశ్రా విలేకరుల సమావేశంలో వివరించారు. కేసు విచారణలో హత్యాకాండకు ఉపయోగించిన వాహనాలను గుర్తించారు. నిందితులను లోతుగా విచారించడంతో మిగిలిన నిందితుల ఆచూకీ కనుగొనడం సాధ్యమైంది. తొలుత ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వీరి సమాచారం ఆధారంగా మిగిలిన ముగ్గురిని నయాగడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఇలా అంచెలంచెలుగా మొత్తం 5 మందిని విచారించడంతో నేరారోపణ బలపడడంతో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని ఆధారాలతో ఇంకొంత మంది అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. రసూల్‌గడ్ హత్యాకాండలో ప్రయోగించిన పలు వస్తువులను పోలీసుల దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వీటిలో 2 మోటార్ సైకిళ్లు, హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలున్న 2 కత్తులు, నిందితులకు చెందిన 4 మొబైల్ ఫోన్లు, రక్తపు మరకలు పడిన 2 సంచులు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. రద్దీగా ఉండే రసూల్‌గడ్ స్క్వేర్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై బైక్‌పై వచ్చిన దుండగులు కత్తితో దాడికి పాల్పడి సహదేవ్ నాయక్ తల నరకడంతో హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో బాధితుని వదిలేసి నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. బ్రౌన్ షుగర్ లావాదేవీలతో బలపడిన కక్షలతో ఈ హత్యకు ఆగంతకులు పాల్పడినట్లు ప్రధాన ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment