ఉత్సాహంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
జయపురం: జయపురం యువత క్రీడలలో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతిభను చాటుతున్నారు. సంబాద్ గ్రూపు ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ 3.0 పోటీలు స్థానిక ఆదర్శనగర్‌లోని డీపీ అకాడమీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనూప్ కుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలపై జయపురం యువతకు మంచి ఆసక్తి ఉందన్నారు. వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే క్రీడా రంగంలో కొరాపుట్ జిల్లాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. సంబాద్ జయపురం ఎడిషన్ చీఫ్ నవీణ చంద్ర సాహు, డీపీ అకాడమీ ప్రతినిధి ఎస్.మునీర్, దేవ దాస్, సుభ్రత్ పండా, ఎం.బాలాజీరావు పాల్గొన్నారు. రెండురోజులు జరగనున్న పోటీల్లో 51 జట్లు తలపడుతున్నాయి. వాటిలో జంబల్ గ్రూపులో 12, సీనియర్ పురుష యుగల్ గ్రూపులు 31, కార్పొరేట్ గ్రూపులో ఎనిమిది జట్లు ఉన్నట్టు నిర్వహకులు తెలిపారు. తొలిరోజున 35 మ్యాచ్‌లు జరిగాయి. జంబల్ గ్రూపుకు సభ్యులు ఎస్.మునీర్, అశిత్ పట్నాయక్, కె.ప్రధాన్, జి.ప్రసాద్, ఆర్.తేజ, సిద్ధార్థ నాయిక్, తిరుపతి పాణిగ్రహిలు విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. అలాగే సీనియర్ పురుషుల యుగల్ గ్రూపులో సాయి చక్రధర్, సౌమ్య పాఢీ, ఆదిత్ రాజ, ఆయుష్ త్రిపాఠీ, సిద్ధార్థన్ నాయిక్, డి.మణికంఠ, ఎస్.మునీర్ అమితాంశు సాహులు సెమీఫైనల్‌కు చేరారు. రిఫరీగా ఆశిత్ పట్నాయక్, అంపైర్‌గా సుజిత్ బొడొనాయిక్ వ్యవహరించారు. సంబాద్ మార్కెటింగ్ అధికారి ఎస్.రవిశంకర్ పోటీలను పర్యవేక్షించారు. పోటీలను తిలకించేందుకు వందలాదిమంది యువ క్రీడాకారులు ఆసక్తి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment