గాజు పొడి పూత దారం నిషేధం
భువనేశ్వర్: మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాలిపటాలు ప్రత్యేక ఉనికిని సంతరించుకున్నాయి. కటక్ మహా నగరం ప్రాంతంలో ఈ సంప్రదాయం అధిక ప్రాచుర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆకాశ వీధుల్లో గాలిపటాల పోటీ జోరుగా సాగుతోంది. ఆకాశ వీధుల్లో ఎగిరే ప్రత్యర్థి గాలిపటం తెగకోసేందుకు పదునైన దారం వాడకంపై ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో గాజు పొడి పూత దారం వాడతారు. దీన్ని చైనీస్ మాంజాగా పిలుస్తారు. ఈ దారం పీకలు తెగ్గొట్టి ప్రాణాంతకమైన ప్రమాదకర పరిస్థితులు తీసుకువస్తుంది. దీంతో చైనీస్ మాంజా దారం వినియోగంపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిషేధ ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణ గాలిలో దీపంలా పరిణమించడంతో ప్రాణాంతక పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరో వైపు కటక్ నగరంలో చైనీస్ మాంజా దారం బహిరంగంగా విక్రయిస్తున్నారు. సాధారణంగా మహా నది తీర ప్రాంతాల్లో గాలిపటాలు తెగి పడుతుంటాయి. ఈ మార్గంలో రాకపోకలు చేసే వారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు ఈ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిలో ఎగిరే గాలిపటం తెగడంతో పరిసర మార్గాల గుండా వెళ్తున్న వారి పీకకు చుట్టుకుని గొంతు కోసుకుపోయి మృతి చెందిన కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సోమ వారం కటక్ నగరం లింకు రోడ్ ప్రాంతంలో గాలి పటం దారంతో ఒకరి గొంతు తెగింది. ఈ విచారకర సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉలికిపాటుకు గురైంది. హై కోర్టు 2016 సంవత్సరంలో జారీ చేసిన నిషేధ ఉత్తర్వుల్ని కఠినంగా అమలు చేసేందుకు నగర కమిషనరేటు పోలీసులు నడుం బిగించారు. చైనీస్ మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కటక్ అదనపు డీసీపీ అమరేంద్ర పండా హెచ్చరించారు. ఈ మేరకు నగర కమిషనరేటు పరిధిలో అన్ని ఠాణాల్లో పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సీజనులో ఇటీవల 7 రోజుల్లో 3 మంది గాలిపటం చైనీస్ మాంజా దారంతో గాపడి ఆస్పత్రి పాలైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment