రాజరాజేశ్వరునిగా జగన్నాథుడు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై జగన్నాథుడు రాజరాజేశ్వరునిగా ధగధగలాడుతున్నాడు. మకర సంక్రాంతి ముందు రోజున మూల విరాటులు స్వర్ణ అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవాయితీ. పవిత్ర పుష్య పూర్ణిమ సందర్భంగా శ్రీ మందిరంలో ప్రత్యేక సేవాదులు నిర్వహించారు. బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథ స్వామి మూల విరాటుల్ని స్వర్ణాభరణాలతో అలంకరించారు. 108 కలశాలతో చందన సుగంధిత జలంతో మూల విరాటుల్ని అభిషేకించిన తర్వాత బంగారు ఆభరణాలతో అలకరించారు. శిరసున కిరీటం, పాదాలకు శ్రీపాయర్, చేతికి శ్రీభుజం ఉన్న హరిదామల్, బహుద మాల, సేవతి మాల, చంద్ర సూర్యులు తదితర వివిధ రకాల బంగారు ఆభరణాలతో రాజరాజేశ్వరుని ఠీవిలో శోభిల్లాడు. జగతి నాథుని ఆజ్ఞ మాల పొందిన తర్వాత శ్రీ మందిరం సముదాయంలో మహాలక్ష్మి ఆలయానికి శ్రీదేవి పల్లకిలో చేరింది. ఈ ప్రాంగణంలో శుద్ధి అనంతరం శ్రీదేవి అలంకరణ పూర్తి చేశారు. 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని రామచంద్రస్వామి అయోధ్యకు తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిష్టించిన ఆనందోత్సాహ వేడుకకు ప్రతీకగా రాజ రాజేశ్వరుని అలంకరణలో శోభిల్లుతాడు. ఈ అలంకరణలో స్వామి దర్శనం కోటి జన్మల పుణ్యఫలమని భక్తుల నమ్మకం. శ్రీ మందిరంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ సందర్భంగా దేవాలయం ప్రత్యేకంగా ముస్తాబవుతుంది. సోమవారం శ్రీ మందిరం శిఖరంకి చున్నార్ వర్గం సేవకులు వెళ్లి శిఖరానికి సున్నం వేశారు.
Comments
Please login to add a commentAdd a comment