‘ఓబీసీ కుల గణన సామాజిక న్యాయానికి సోపానం’
భువనేశ్వర్: సమగ్ర ఓబీసీ కుల గణనను నిర్వహించాలని, ఒడిశాలోని ఎస్‌ఈబీసీలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని ఓబీసీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌కు గురువారం బిజూ జనతా దళ్ నాయకుల సీనియర్ బృందం అభ్యర్థించింది. ఈ బృందం సమర్పించిన అభ్యర్థన పత్రంలో భారత దేశంలో సమగ్ర కుల గణనను నిర్వహించాల్సిన ఆవశ్యకతను సీనియర్ బిజూ జనతా దళ్ నాయకులు ఎత్తిచూపారు. సామాజిక, ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) 2011 నివేదికలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల సంక్షేమ కార్యాచరణ నియమావళి, మార్గదర్శకాల రూపకల్పన, వనరుల సమాన పంపిణీకి అవసరమైన కీలకమైన కుల సంబంధిత డేటా లేదని బీజేడీ వివరించింది.
సామాజిక, ఆర్థిక, కుల గణన – 2011లో గ్రామీణ, పట్టణ, కుల గణనలు మూడు విభిన్న భాగాలు. గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర సమన్వయంతో వివిధ అధికారుల పర్యవేక్షణలో ఈ విభాగాల నిర్వహణ కొనసాగుతుందని, దీనికి అనుకూలంగా వివరణాత్మక సమాచారం, విశ్లేషణ లేకపోవడం వివిధ కుల సమూహాలలో సామాజిక, ఆర్థిక గతిశీలతను నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే దిశలో నడిపించేందుకు ప్రధాన అంతరాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ అవాంతరం తొలగించి అట్టడుగు వర్గాలకు సంబంధించిన నిర్దిష్ట అవసరాలను తీర్చగల లక్ష్య విధానాల సూత్ర ఆవిష్కరణకు ఓబీసీ కుల గణన అనివార్యమని వివరించారు. వివిధ కుల సమూహాలలో గృహ నిర్మాణం, ఆదాయ వనరులు, విద్యా సాధన, ఉద్యోగ స్థితి వంటి రంగాల్లో అభివృద్ధికి ప్రామాణికల్ని రూపొందించేందుకు కుల గణన నివేదిక సమగ్ర సమాచారం అందించేలా కుల గణన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాదించారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ విధానాలను మూల్యాంకనం చేయడానికి, సర్దుబాటు చేయడానికి కచ్చితమైన కుల సంబంధిత వివరాలు చాలా అవసరం. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో అట్టడుగున మగ్గిపోతున్న అత్యంత అవసరమైన సామాజిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు తాజా రిజర్వేషను వ్యవస్థ ఆవిష్కరణ అవసరంగా బీజేడీ ప్రతినిధి బృందం వివరించింది. బిజూ జనతా దళ్ నాయకులు ఓబీసీ సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీని ఓబీసీ కుల గణనను వెంటనే ప్రారంభించాలని అభ్యర్థించింది. ఒడిశాలోని సామాజిక, ఆర్థిక వెనుకబడిన వర్గాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment