రేపటి నుంచి చిలికా పక్షుల లెక్కింపు
భువనేశ్వర్: చిలికా సరస్సు పక్షుల ఆగమనంతో కళకళలాడుతోంది. మరోవైపు పర్యటకుల సందర్శనతో కిటకిటలాడుతోంది. దీంతో ఈనెల 18 నుంచి పక్షుల లెక్కింపు చేపట్టనున్నట్లు అటవీ విభాగం అధికారులు తెలియజేశారు. సువిశాల ఈ సరస్సులో ఉన్న పక్షులను లెక్కించేందుకు 5 రేంజులుగా విభజించారు. ఈ రేంజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పక్షుల గణన చేపడతారు. రంభ, బాలుగాంవ్, టంగి, సత్తొపొడా, చిలికా 5 రేంజుల్లో పక్షులను లెక్కిస్తారు. దీనికోసం 21 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 4 నుంచి 5 మంది వరకు సభ్యులు ఉంటారని మండల అటవీ శాఖ అధికారి తెలిపారు. అలాగే సత్తొపొడా తీరంలో ఈనెల 20 నుంచి 22 వరకు డాల్ఫిన్ల లెక్కింపు కొనసాగునుంది.
మద్యం దుకాణాన్ని తరలించాలి
రాయగడ: స్థానిక సాయిప్రియ నగర్‌లోని విదేశీ మద్యం దుకాణాన్ని తరలించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్టు కార్యదర్శి దయానిధి ఖడంగ నేతృత్వంలో ట్రస్టు సభ్యులు ఎకై ్సజ్ అధికారి సంజయ్ ప్రధాన్‌కు వినతిపత్రం గురువారం అందజేశారు. జనావాసాలు, విద్యా సంస్థలు, నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో విదేశీ మద్యం దుకాణం ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రస్టు కోశాధికారి జి.బ్రహ్మాజి, జి.దామోదర్, అరుణ్ కుమార్, సాహు, గౌరి శంకర్ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
రాయగడ: రహదారిపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించాలని జీఐఈటీ కులపతి డాక్టర్ వీఎల్‌ఎన్ శర్మ సూచించారు. జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి గుణుపూర్ కళాశాల ఈ ర్యాలీ కొనసాగింది. వాహనదారులు నిబంధనలు పాటిస్తే ట్రాఫిక్ సమస్య దూరమవ్వడంతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వాణి ప్రసాద్ నాయక్, ఘనిష్ట ప్రష్టి, డి.నిర్మల్ పటేల్, రంజన్ పండ, బి.ప్రియాంక, చిన్మయి రంజన్ స్వయి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
భువనేశ్వర్: కోణార్క్ సమీపంలో బుధవారం రాత్రి కారు ప్రమాదం జరిగింది. కోణార్క్ నిమాపడా బన్సీ బజార్ జుణై ఛొకొ సమీపంలో అదుపు తప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు సందీప్ మహాపాత్రో మరియు సనాతన్ సేనాపతిగా గుర్తించారు. కారు కోణార్క్ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తుండగా నిర్మాణ పనులు జరుగుతున్న రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొనకుండా ప్రమాదం నివారించే ప్రయత్నంలో అదుపు తప్పి చెరువులోకి వెళ్లింది. స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న 4 మంది ప్రయాణికులను బయటకు తీసి తక్షణమే గోప్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు వారిలో ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించారు. గాయపడిన మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వీరు ఇద్దరూ బాలాసోర్‌కు చెందినవారు. సహాయ చర్యలు తర్వాత దెబ్బతిన్న వాహనాన్ని కోణార్క్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోణార్క్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment