వృద్ధుల ఆధ్యాత్మిక ఆకాంక్ష సాకారం
స్పెషల్ రైలు ప్రారంభించిన ముఖ్యమంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న వయో వృద్ధుల తీర్థ యాత్ర స్పెషల్ రైలుని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి శుక్రవారం ప్రారంభించారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరింది. ఈ విడతలో వయో వృద్ధుల తీర్థయాత్ర పథకం కింద షిర్డీ, నాసిక్‌లకు తీర్థయాత్ర రైలును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వయో వృద్ధుల ఆధ్యాత్మిక, మతపరమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. విడతలో ఖుర్దా, పూరీ, కటక్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రాపడా, ఢెంకనాల్ ఆరు జిల్లాల నుంచి 775 మంది వృద్ధులు మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన షిర్డీ, నాసిక్ క్షేత్రాలు సందర్శిస్తారని చెప్పారు.
ఈ ఏడాది విడతలవారీగా రాష్ట్రంలో సమగ్రంగా 8,000 మంది వృద్ధులకు షిర్డీ, నాసిక్, దక్షిణ కాళీ (కోల్‌కతా), కామాక్ష, అయోధ్య, వారణాసి తదితర ప్రాంతాలకు ఉచిత యాత్ర సౌకర్యం కల్పిస్తామన్నారు. 10 విడతలుగా స్పెషల్ రైలు నడుస్తుందన్నారు. త్వరలో మరో 2 విడతల్లో భువనేశ్వర్, బరంపురం, సంబల్‌పూర్, రాయగడ, బాలాసోర్ స్టేషన్ల నుంచి రెండు దశల్లో ఈ తీర్థయాత్ర రైలు బయలుదేరనుందని వివరించారు.
స్వగ్రామం నుంచి ఉచిత రవాణా..
యాత్రికులందరికీ స్వగ్రామం నుంచే ప్రయాణం ప్రారంభించి రైల్వే స్టేషన్ వరకు వచ్చేలా ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. యాత్రికులందరికీ బస, రైల్వే స్టేషన్ నుంచి యాత్రాస్థలికి రవాణా, భోజన, పానీయాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపౌరుల మతపరమైన, ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రపంచ ప్రసిద్ధ మహా కుంభమేళా కోసం నాలుగు అత్యాధునిక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. దీంతో పాటు మహా కుంభమేళా కోసం ఒడిశా నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment