ధాన్యం కుప్పలు దగ్ధం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పూజారిగుడ పంచాయతీలోని పటాబొంధొ గ్రామంలో గల ధాన్యం కుప్పలు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన పురేంద్ర కర్షిక, నరేంద్ర కర్షిక, ప్రశన్న గంతాయిత్, జయసింగ్ హుయిక, సునా కడ్రక, కృష్ణ తడిక, లచ కడ్రక, ముగురి కర్షక అనే రైతులకు చెందిన సుమారు 1500 క్వింటాళ్ల ధాన్యం మంటలకు పూర్తిగా కాలిబూడిదయ్యింది. ఖరీఫ్ ధాన్యం కోతలు కొసిన వెంటనే వాటిని పంట పొలంలో 18 కుప్పలుగా వేసి రైతులు అమ్మకానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలో గల వారు రైతులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ధాన్యం కుప్పలు పూర్తిగా కాలిపోయాయి. అగ్రిప్రమాదం సమాచారం తెలుసుకున్న పూజారిగుడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర ఆచార్య, నమిత రాణి గొమాంగొలు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాద విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment