యూరియా కరువు
యూరియా కోసం రైతుల ఇబ్బందులు
యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న పంటకు యూరియా చాలా అవసరం. యూరియా అందుబాటులో లేకపోతే రైతు పంటను నష్టపోతాడు. సకాలంలో యూరియా రావడం లేదు.ఏదో సమయంలో యూరియా లోడు పంపించినా రైతులకు సరిపోవడం లేదు. సరిపడేంత యూరియా అందబాటులో లేకపోవటంతో రైతులు అవస్థలు పడుతున్నారు.రైతుల సాగుకు సరిపడేలా యూరియా అందుబాటులో ఉంచాలి.
– గుడివాడ తమ్మినాయుడు,
సర్పంచ్, వెదుళ్లవలస
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రతి ఏడాదీ యూరియా సమస్య రైతులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైతులకు యూరియా పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గరివిడిలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సైతం యూరియా అందుబాటులో ఉండడం లేదని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల ఎదుగుదలకు యూరియా చాలా అవసరం. అలాంటి యూరియా సకాలంలో ఆందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గరివిడి మండలంలో 21 రైతు సేవాకేంద్రాలు ఉన్నాయి.వాటితో పాటు కాపుశంభాం, కోనూరు, తాటిగూడ, గొట్నంది గ్రామాల్లో సొసైటీలు ఉన్నాయి. గతంలో రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ రాకముందు యూరియా సొసైటీల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అందించేవారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాల వ్యవస్థను నెలకొల్పిన తరువాత గ్రామాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల నుంచి నేరుగా ఎరువులను అందించే సౌకర్యం కల్పించింది. దీంతో గ్రామాల్లో ఉండే రైతులకు పట్టణాలకు పోయి ఎరువులను కొనుగోలు చేసే కష్టాలు తగ్గినట్లయ్యింది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత రబీ సీజన్‌లో సొసైటీల్లోగాని, రైతు సేవా కేంద్రాల్లో గాని యూరియా కావాల్సినంత ఉండడం లేదని, ఈ కారణంగా యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు చెబుతున్న మాట. గత వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముందస్తుగానే యూరియా అందుబాటులో ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లోను, సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన రూ.266లకు యూరియా అందేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవటంతో ఓపెన్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో యూరియా అందుబాటులో లేకపోయినా బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతోందని, ఒక్కో యూరియా బస్తాకు అదనంగా 50 నుంచి 80 రూపాయలు వెచ్చించి కొనాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
పంట ఎదుగుదలకు యూరియానే ఆధారం
ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంట ఎదుగుదల కోసం రైతులు ఎక్కువగా యూరియాపైనే ఆధార పడతారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది రబీ సీజన్‌లో 3000 ఎకరాల్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగుచేశారు. మొక్కజొన్నతో పాటు ఇతర రకాల కూరగాయలు, మిరప, అపరాలు, బొప్పాయి, వేరుశనగ తదితర రకాల పంటలతో కలిపి 5వేల ఎకరాలకు పైబడే సాగుబడి చేశారు. ఖరీఫ్‌లో కంటే రబీ సీజన్‌లోనే మొక్కజొన్న పంటను సాగుచేసేందుకు రైతులు ముందడుగు వేస్తారు.రబీ సీజన్‌లో సాగుచేసిన పంట నుంచి దిగుబడులు అనుకూలంగా రావడం కారణంగా రైతులు మొక్కజొన్నను ప్రధానపంటగా సాగు చేస్తారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు యూరియానే ప్రధాన ఆధారం. యూరియా సకాలంలో పంటకు అందించకపోతే పంట ఎదుగుదల లోపిస్తుందని చెప్తున్నారు. యూరియాను రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులోనికి తీసుకువస్తున్నప్పటికీ ఏమాత్రం సరిపోవడం లేదని, పంటల సాగుకు సరిపడే విధంగా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
24 టన్నుల యూరియాను అందించాం
రబీసీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు అనుగుణంగా మొదట విడతలో 12 టన్నుల యూరియాను, రెండో విడతలో 12 టన్నుల యూరియాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అందించాం. మూడో విడత యూరియా కోసం ప్రతిపాదనలు చేశాం. యూరియా వచ్చాక రైతుసేవా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం. రైతులు కూడా మోతాదుకు మించిన యూరియాను వినియోగిస్తున్నారు. ఇలా యూరియాను వినియోగించడం వల్ల పంటకే నష్టం జరుగుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి వినియోగిస్తున్నందున కూడా యూరియా కొరత ఏర్పడుతోంది.
– శైలజ, మండల వ్యవసాయాధికారి,
గరివిడి మండలం
అరకొరగా సరఫరా
ఎరువు కోసం రైతుల అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment