వరిచేను కుప్పలు దగ్ధం
● సుమారు రూ.3లక్షలు వరకు ఆస్తినష్టం
● భోరున విలపిస్తున్న రైతులు
తెర్లాం: మండలంలోని సుందరాడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 140 బస్తాల దిగుబడినిచ్చే నాలుగు వరిచేను కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి సంబంధించి బాధిత రైతులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేజేటి లక్ష్ముం, ముత్తా నగేష్, కుసుమూరు పెంటయ్య, ముత్తా తిరుపతి అనే రైతులు సంక్రాంతి పండగ ముందు వరిచేను కోసి, గ్రామానికి సమీపంలో ఉన్న పణుకురాయిపై కుప్పలు వేశారు. సంక్రాంతి పండగ అయిన తరువాత వరిచేను నూర్పులు చేసుకోవచ్చని భావించారు. అయితే ఆదివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు వరిచేను కుప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 140 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వచ్చేదని, సుమారు రూ.3లక్షల వరకు నలుగురు రైతులకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు, గ్రామస్తులు అంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిచేను అగ్నికీలలకు ఆహుతైపోయిందని, చేతికంది వచ్చిన పంట బూడిదైపోయిందని బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నలుగురు రైతులకు సంబంధించిన నాలుగు వరిచేను కుప్పల్లో ఒక్క ధాన్యం గింజ కూడా మిగలకుండా పూర్తిగా కాలిపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రాజాంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు స్పందించి మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న మరికొన్ని వరిచేను కుప్పలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment