ఏరియా ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య
పాలకొండ రూరల్: కడుపు నొప్పితో పలుమార్లు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తన ఆరోగ్య సమస్య తీవ్రతను తట్టుకోలేక ఆస్పత్రిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాలకొండలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన బెవర జోగినాయుడు(45) రెండేళ్లుగా తీవ్ర కడుపునొప్పి(పాంక్రియాటిస్) సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో వైద్యం పొందినా ఆరోగ్యం మెరుగుపడలేదు. తాజాగా శనివారం మరోమారు నొప్పిరావడంతో వేకువజామున జోగినాయుడు తన భార్య కల్యాణితో కలిసి పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. వైద్యసేవలు పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మేల్ వార్డు సమీపంలో ఉన్న బాత్‌రూమ్‌కు వెళ్లి తన వద్ద ఉన్న తువ్వాలుతో కిటికీకి ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారు జామున సహచర రోగులు ఈ విషయం గమనించి వార్డులో ఉన్న మృతుడి భార్యకు తెలియజేశారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించగా ఆస్పత్రికి వచ్చారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రికి చేరుకుని జోగినాయుడు మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని, అలాగే అప్పగించాలని ఓవైపు ఆస్పత్రి, మరోవైపు పోలీసులతో వాదులాటకు దిగారు. పాలకొండ సీఐ మీసాల చంద్రమౌళి ఆస్పత్రికి చేరుకుని ఎంఎల్‌సీ (మెడికో లీగల్ కేస్) నమోదైన క్రమంలో అధికార వర్గాలకు సహకరించాలని వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై నారాయణ తెలిపారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు వెంకటేష్, కుమార్తె సూర్యకళ ఉన్నారు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న జోగినాయుడు సౌమ్యుడని, ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడం పట్ల గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
పోస్టుమార్టం వద్దన్న కుటుంబసభ్యులు
నచ్చజెప్పిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment