ఆడలి వ్యూపాయింట్ రహదారి పరిశీలన
సీతంపేట: మండలంలోని ఆడలి వ్యూపాయింట్ మార్గంలో ఉన్న రహదారి మలుపులను ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈనెల 18న ఆహ్లాదం మాటున విషాదం శీర్షికన ఘాట్ రోడ్‌లో మలుపులతో పాటు ఇటీవల ఆడలి వెళ్లే మార్గంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై సాక్షిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయో స్వయంగా చూశారు. రహదారి విస్తరణ, మలుపుల వద్ద రక్షణ గోడల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. జలుబుగూడ గ్రామానికి రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ నాగభూషణరావు పాల్గొన్నారు.
తోటపల్లి ఈఈ రామచంద్రరావుకు ఉద్యోగోన్నతి
● పోలవరం హెడ్‌వర్క్స్ సర్కిల్ ఎస్‌ఈగా నియామకం
విజయనగరం అర్బన్: తోటపల్లి ప్రాజెక్ట్ రాజాం డివిజన్ ఈఈ రెడ్డి రామచంద్రరావుకు సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ)గా పదోన్నతి లభించింది. ఇరిగేషన్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌ఈ. పోస్టులకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదోన్నతుల జాబితాలో ఆయన పేరును పేర్కొంది. పదోన్నతి అధికారులకు పోస్టుల కేటాయింపులు కూడా తాజాగా జరిగాయి. పోలవరం హెడ్ వర్క్స్ సర్కిల్ ఎస్‌ఈగా రామచంద్రరావుకు నియామకాలు విడుదలయ్యాయి. ఈఈ కేడర్‌లో వివిధ ప్రాంతాల్లో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. రాజాం డివిజన్ ఈఈగా 10 ఏళ్లు, వంశధార ప్రాజెక్టు హిరమండలం డివిజన్ ఈఈగా ఒక సంవత్సరం పనిచేశారు. అంతకుముందు విశాఖలోని నార్త్ కోస్టు చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం పనిచేశారు.
ఇద్దరు నిందితులకు రిమాండ్
పాచిపెంట: మండలంలోని పాంచాలి గ్రామంలో పాంచాలి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిని గాయపరిచి, అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు మరికొందరి దగ్గర నగదు, సెల్‌ఫోన్‌లను దొంగలించిన కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన పాచిపెంట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వెంకటసురేష్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 16న ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడి, దోపిడీ కేసులో ఉనుకూరు జోసెఫ్, మోసూరు శివలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. వారు దోచుకున్న సెల్‌ఫోన్లను, నగదును దాడి సమయంలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
డ్రైనేజీలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక దాసన్నపేట రైతు బజార్ దగ్గరలో ఉన్న డ్రైనేజీలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతిచెందినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. మృతుడికి సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందని, మృతుడి చేతిపై ఆదిలక్ష్మి అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించామని, ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9121109420, 9121109438 నంబర్లను సంప్రదించాలని కోరారు.
300 సారా ప్యాకెట్ల పట్టివేత
సాలూరు: పట్టణంలో సారా ప్యాకెట్లు కలిగి ఉన్న ఒడిశాకు చెందిన మహిళను పట్టుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఎరుకుల వీధి జంక్షన్ వద్ద 30 లీటర్లు (300 ప్యాకెట్లు)తో ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళను ఆదివారం అరె స్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. సారా,ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసినా, క్రయవిక్రయాలు చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment