కిడ్నీ విషాదాలు పుస్తకావిష్కరణ
కాశీబుగ్గ: ఉద్దాన ప్రాంతంలో కిడ్నీవ్యాధి మూలాలు, అక్కడి పరిస్థితులకు అక్షర రూపమిస్తూ రచించిన ‘కిడ్నీ విషాదాలు’ పుస్తకాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పరాజు పలాసలో గురువారం ఆవిష్కరించారు. రంగోయి గ్రామానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు బద్రి కూర్మారావు ఈ పుస్తకాన్ని రచించారు. కార్యక్రమంలో కో–ఆప్షన్ సభ్యులు బమ్మిడి సంతోష్‌కుమార్, నాయకులు శిష్టు గోపి, జినగ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
పొందూరు: పొందూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్‌పీ శ్రీకాకుళం రైల్వే ఎస్‌ఐ మధుసూదనరావు గురువారం తెలిపారు. పసుపు రంగు ఫుల్‌హ్యాండ్ షర్టు, ఆకుపచ్చ షార్టు ధరించి ఉన్నాడని చెప్పారు. వివరాలు తెలిసిన వారు 9493474582 నంబరుకు సంప్రదించాలని కోరారు.
వెబ్‌సైట్ రూపకర్తకు
ఎస్పీ అభినందనలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లా పోలీసుల నూతన వెబ్‌సైట్ ‘శ్రీకాకుళంపోలీస్.ఎపి.జివొవి.ఇన్’ రూపకల్పన చేసిన కంచిలి మండలం కేసరపడ గ్రామానికి చెందిన కొరికాన నవీన్‌ని ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి గురువారం అభినందించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నగదు, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన నవీన్ విద్యార్థి దశలోనే ప్రతిభ కనబరిచి ఒక్క క్లిక్‌తో జిల్లా పోలీస్ శాఖ పూర్తి వివరాలు తెలుసుకునేలా వెబ్‌సైట్ రూపకల్పన చేయడం గొ ప్ప విషయమన్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఏఎస్‌ఐ రమేష్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
పకడ్బందీగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై గురువారం తన చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయని ఆర్‌ఐఓ పి. దుర్గారావు తెలిపారు. ప్రయోగ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. ఒకేషనల్ కోర్సు పరీక్షలు 5 నుంచి ప్రారంభమవుతాయన్నారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వరకూ జరుగుతాయన్నారు. మొత్తం 40356 మంది (ఫస్టియర్ 20,389, సెకండియర్ 19,967 మంది) విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో 37,976 మంది సాధారణ, 2380 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారని వివరించారు. 75 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జెరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయానికి విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment