విద్యార్థినుల ఆత్మహత్యాయత్నంపై విచారణ
సత్తెనపల్లి: సత్తెనపల్లి వెంకటపతి నగర్‌లోని ఎస్సీ కళాశాల వసతి గృహంలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నంపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ ఓబుల్‌నాయుడు, సత్తెనపల్లి ఇన్‌చార్జి ఆర్డీఓ మధులత వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పలువురు మాట్లాడుతూ ఆహారం తినడానికి రుచికరంగా ఉండడం లేదని, దీంతో తినలేకపోతున్నామన్నారు బాత్ రూమ్‌లకు కనీసం తలుపులు లేవని, తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. చికెన్ వండిన రోజు తినాలంటే నీచు వాసన వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వారితోపాటు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గార్లపాటిదాసు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలనువేగవంతం చేయండి
నరసరావుపేట: ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి జిల్లాలో పేదలకు మంజూరైన ఇళ్లలో 5,650 నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జాషువా సమావేశ మందిరంలో హౌసింగ్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, జియో ట్యాగింగ్, పోషణ్ వాటిక, ఎన్పీసీఐ మ్యాపింగ్, ఉపాధి హామీ వేతనాల చెల్లింపులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాది పూర్తయ్యేనాటికి 15,800 ఇళ్లకు స్టేజ్ కన్వర్షన్ చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉపాధి పథకం ద్వారా వేతనాలు చెల్లించిన దాఖలాలు కనిపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment