నీటి సంఘాల ఎన్నిక అపహాస్యం
నరసరావుపేట: అధికార కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేసిందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. జిల్లాలో ఎక్కడా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. ముందుగానే నిర్ణయించుకున్న పేర్లను అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికై నట్లు ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికలకు కనీసం ఓటర్ల జాబితా కూడా ప్రతిపక్షాలకు అందజేయలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉంది. ఎవరూ ప్రశ్నించకూడదనే దృక్పథంతో టీడీపీ, జనసేన అనుకూలురు అధికంగా ఉన్న గ్రామాల్లోనే ఎన్నికలు తంతుగా నిర్వహించారు. ఉదాహరణకు నరసరావుపేట మండలానికి సంబంధించి ఎన్నికలను యల్లమంద, రావిపాడు, కాకాని, పమిడిపాడు, కేసానుపల్లి తదితర గ్రామాల్లో నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఎన్‌ఎస్పీ, రెవెన్యూ ఉద్యోగులకు శుక్రవారం రాత్రి గూగుల్ షీట్లు అందజేసి ఎవరెక్కడ ఎన్నికల ఉద్యోగం చేయాలో చెప్పారు. వారికి ముందస్తుగా కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. ఒక్కో టీసీకి ఇద్దరు ఉద్యోగులను నియమించి ఉదయాన్నే కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. తీరా అక్కడకు వెళ్లిన ఉద్యోగులకు కనీస ఏర్పాట్లు చేయలేదు. ఒక్కో టీసీకి ఇద్దరు వ్యక్తులు రావటం, ఒక వ్యక్తి ప్రతిపాదించటం, మరొకరు ఎన్నికై నట్లు ప్రకటించటం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యవహరించిందనే భావన ఉద్యోగుల్లో ఉంది. కాగా, జిల్లాలో 219 మేజర్, 55 మైనర్ కలిపి మొత్తం 274 సాగునీటి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం డబ్ల్యూయుఏలకు ఎన్నికలు పూర్తికాగా, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ)లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను రెవెన్యూ, జలవనరులశాఖలు ఏర్పాట్లు చేశాయి. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో 32 డీసీలు ఉండగా, వాటిలో మాచర్ల, గురజాల, కారంపూడి, చామర్రు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, మేడికొండూరు, తంగెడ, బెల్లంకొండ, క్రోసూరు, కేసానుపల్లి, పిడుగురాళ్ల, పెదకూరపాడు, అమరావతి, ఫిరంగిపురం, గుంటూరు, పొన్నెకల్లు, లింగంగుంట్ల, చిలకలూరిపేట–1,2, పెదనందిపాడు, సంతగుడిపాడు, రొంపిచర్ల, గంటావారిపాలెం, వినుకొండ, చీకటీగెలవారిపాలెం, ఐనవోలు, త్రిపురాపురం, ములకలూరు, సంతమాగులూరు, కొమ్మాలపాడు ఉన్నాయి. డీసీల వారీగా రెవెన్యూశాఖ ఓటర్ల జాబితా సిద్దంచేసింది. జిల్లా వ్యాప్తంగా ఓటర్లుగా పురుష రైతులు 3లక్షలవరకు ఉండగా మహిళా రైతులు ఒక లక్షవరకు ఉన్నారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామ సాగునీటి సంఘం ఎన్నికల్లో స్వల్ప గర్షణ చోటుచేసుకుంది. తొమ్మిదవ నెంబర్ టీసీకి సంబంధించి పార్టీ నాయకులు ఆమోదించిన పేరు కాకుండా వేరే వ్యక్తిని ఎన్నిక చేశారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంతసేపు ఎన్నిక ఆగిపోయింది. ఎమ్మెల్యే జోక్యంతో మరల ఎన్నిక సజావుగా సాగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా ఆగమ్యగోచరం వ్యక్తమైంది. ఓ టీసీలో తొమ్మిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
తూతూమంత్రంగా ఎన్నికల ప్రక్రియ
ఓటరు జాబితా కూడా అందజేయని అధికారులు ముందస్తుగా ఉద్యోగులకు ఇవ్వని శిక్షణ రాత్రికి ఆర్డర్లు ఇచ్చి ఉదయాన్నే ఉద్యోగం చేయాలన్న ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment