కన్న కొడుకే కాలయముడు
విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దారు.. వృద్దాప్యంలో ఆసరాగా ఉంటాడని ఆశించారు..కానీ అతనే చివరకు తమ ప్రాణాలు తీస్తాడని ఊహించలేకపోయారు ఆ వృద్ధ దంపతులు. బాపట్ల మండలం అప్పికట్లలో ఆస్తి కోసం తల్లిదండ్రులను కొడుకు కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
బాపట్లటౌన్: బాపట్ల జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన పాగోలు విజయభాస్కరరావు (74) హైస్కూలు ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారు. ఆయన తన భార్య వెంకటసాయికుమారి (70)తో కలసి అప్పికట్ల గ్రామంలోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె (లోక కళ్యాణి), కుమారుడు (కిరణ్ చంద్ర) ఉన్నారు. వీరిద్దరికి వివాహం చేశారు. కుమారుడు చీరాలలోని పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పికట్లలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ప్రతిరోజూ చీరాల వెళ్తుంటాడు. కిరణ్‌చంద్ర భార్య పిల్లలు విజయవాడలో నివాసం ఉంటున్నారు. కుమార్తె బాపట్లలో నివాసం ఉంటుంది. మృతులకు అప్పికట్ల గ్రామంలో మూడు అంతస్తుల భవనం, విజయవాడలో మరో ఇల్లు, ప్లాట్లు, పొలాలు ఉన్నాయి. మృతుడికి నెలకు రూ. 60 వేలు పెన్షన్, ఇంటి అద్దెలు సుమారు రూ.20 వేలకు పైగా వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చిన సొమ్మును కుమార్తెకు పెడుతున్నారు..మీ పేరుతో ఉన్న ఆస్తి మొత్తం నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ కొడుకు తరచూ తల్లిదండ్రులతో వాగ్వివాదానికి దిగుతుండేవాడు. ఇప్పటికి రెండు పర్యాయాలు ఆస్తి మొత్తం నా పేరుతో రాయకపోతే మిమ్ములను ఇద్దరిని చంపేస్తానంటూ పలుమార్లు హెచ్చరించారని కుమార్తె లోక కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆస్తి కోసమే హత్య
ఆస్తిని రాసేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపకపోవడంతో ఆగ్రహించిన కుమారుడు శుక్రవారం రాత్రి తల్లిదండ్రులతో తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. మేము పోయిన తర్వాత ఆస్తి మొత్తం నీకే కదా వచ్చేది...దాని గురించి ఇప్పుడెందుకు అరుస్తున్నావ్ అంటూ తల్లిదండ్రులు మందలించారు. ఎన్నిసార్లు చెప్పిన వీరు నా మాట వినడం లేదనే అక్కసుతో వీరిని ఎలాగైనా అంతమొందించాలని పథకం పన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులను రోకలిబండతో మోది వారి మోహాలు గుర్తుపట్టని విధంగా నుజ్జునుజ్జు చేసి కిరాతకంగా హత్యచేశాడు. ఈ విషయం తెలుసుకున్న కుమార్తె లోక కళ్యాణి హుటాహుటిన అప్పికట్ల చేరుకుంది. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి బోరున విలపించింది. తల్లిదండ్రులను తన సోదరుడు కిరణ్‌చంద్ర హతమార్చాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణలు నిందితుడు కిరణ్‌చంద్రను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య బాపట్లలో సంచలనం రేపిన ఘటన పోలీసుల అదుపులో నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment