శాస్త్రోక్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు
అమరావతి: అమరావతి అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం దత్తాత్రేయుడు, దత్తాత్రేయ పాదాల వద్ద దత్తజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మేడివృక్షం వద్ద మంగిశెట్టి శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌ల నిర్వహణలో కౌశిక చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత దత్తాత్రేయుని విగ్రహనికి, పాదాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశేష అలంకారం చేశారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనంతో మొదలైన ఈ పూజా కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల, భక్తుల నామసంకీర్తనల నడుమ రుద్రహోమం, లక్ష్మీగణపతి చండీహోమం, నవగ్రహా హోమం, దత్తాత్రేయ హోమం నిర్వహించారు. పూర్ణాహుతితో ముగించారు. వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం నిర్వహించి భక్తులకు నీరాజన మంత్ర పుష్పాలను అందించారు. పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులందరికి తీర్ధప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి నూతన కమిటీ
లక్ష్మీపురం: ఏపీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 5వ రీజియన్ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు రీజియన్ గౌరవ అధ్యక్షుడు మేడా హనుమంతరావు తెలిపారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో శనివారం రీజియన్ మహాసభ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. కొత్త కమిటీలో అధ్యక్షుడిగా ఎన్. పూర్ణచంద్రరావు, రీజినల్ సెక్రటరీగా కె.శ్రీహరి రాజు, ట్రెజరర్‌గా సయ్యద్ ఖాన్‌తోపాటు 9 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వివరించారు. అనంతరం నూతన అధ్యక్షుడిని ఘనంగా సత్కరించారు.
కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది వినతి
తాడేపల్లి రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శనివారం సీఎం చంద్రబాబుకు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ జి.వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ మొత్తం 1,700 మంది హెల్త్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో పొరపాట్లు సరిదిద్దాలన్నారు. విధుల నుంచి తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. విజయవాడలో వరదలలో సేవలు అందించి అనారోగ్యం పాలైన వారిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తోట గిరి, గుండుగొలను నాగరాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment