న్యాయవాది మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
సత్తెనపల్లి: అనంతపురం పోలీసుల అనుచిత ప్రవర్తనతో పోలీస్ స్టేషన్‌లోనే సీనియర్ న్యాయ వాది శేషాద్రి గుండెపోటుతో మరణించారని, దీనికి కారకులైన పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జ్యూడీషియల్ విచారణకు ఆదేశించాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంబాల అనిల్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సోమవారం సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఉన్న నాలుగు న్యాయస్థానాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ముందుగా కోర్టు ఆవరణలోని న్యాయదేవత విగ్రహం వద్దకు చేరుకొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయ వాదుల్లో ఒకరు అయిన బి.వి శేషాద్రి అక్కడ ఉన్న మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తన క్లయింట్ తరుపున సివిల్ వివాదంలో ఒక కేసును డీల్ చేస్తున్నారన్నారు. మీకు చట్టపరంగా ఆ హక్కు లేదని క్లయింట్ తరుపున నోటీసు పంపారన్నారు. ఆ అక్కసుతో సీఐ పదేపదే న్యాయవాదిని స్టేషన్‌కు పిలవగా ఆ న్యాయవాది తన జూనియర్ న్యాయవాదులతో కలసి స్టేషన్‌కు వెళ్లగా సీఐ జూనియర్ న్యాయవాదులను లోపలకి అనుమతించకుండా కేవలం శేషాద్రినే అనుమతించి తన చాంబర్‌లోకి సెల్‌ఫోన్ కూడా అనుమతించకుండా ఆ న్యాయవాదిని విచారణ పేరుతో గట్టిగా మాట్లాడటంతో అక్కడే న్యాయవాది శేషాద్రి గుండెపోటుతో మరణించాడన్నారు. కనీసం మానవత్వం కూడా చూపకుండా సీఐ జూనియర్ న్యాయాదులను పిలిచి మీ సీనియర్ న్యాయవాదికి పిట్స్ వచ్చాయి అని అక్కడి నుంచి తరలించగా అప్పటికే 30 నిమిషాల కిత్రమే న్యాయవాది శేషాద్రి మరణించారని వైద్యులు తెలిపారన్నారు. ఈ సంఘటనకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పిన్నమనేని పాములయ్య, చిలుక చంద్రశేఖర్, పూజల వెంకట కోటయ్య, అనుమోలు జయరాం, బి.ఎల్.చిన్నయ్య, దివ్వెల శ్రీనివాసరావు, కన్నెధార హనుమయ్య, కొల్లా వెంకటేశ్వరరావు, రాజశేఖరుని గోపాల కృష్ణమూర్తి, మద్దినేని వెంకట చలపతిరావు, కాకర్ల హరిబాబు, రాజవరపు నరసింహారావు, మన్నెం వెంకటేశ్వరరావు, తవ్వా హరనాథ్, సురే.వీరయ్య, నరిశేటి వేణుగోపాల్, జూపల్లి శేషయ్య, బాదినేడి శ్రీనివాస రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment