గమ్ మత్తుగా చిత్తు!
సింథటిక్ రబ్బర్ గమ్ వ్యసనం బారిన యువత●
● దాన్ని పీల్చుతూ అలౌకిక ఆనందం ● మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న వైనం ● ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అమరావతి: రెక్సిన్, ఫోమ్, వుడ్, ఫ్లైవుడ్, మెటల్‌లను అంటించటానికి, అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువుల అంటించటానికి ఉపయోగించే సింథటిక్ రబ్బర్ అదేషివ్ గమ్ బోన్‌ఫిక్స్ యువకుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పలు గ్రామాలలో సుమారు 15 సంవత్సరాల పైబడిన బాలురు, యువకులు మత్తుకు అలవాటు పడి.. ఎలాగైన మత్తులో ఉన్న గమ్మత్తును అనుభవించాలనే ఆతృతతో తక్కువ ధరకు మార్కెట్ సులభంగా దొరికే బోన్‌ఫిక్స్ గమ్ వినిమోగిస్తున్నారు.
ప్రమాదాన్ని ‘ఆస్వాదిస్తూ..’
మద్యం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.100 –150 ఖర్చు అవుతుంది. అందువల్ల తక్కువ ఖర్చుతో అదే మత్తును ఇస్తున్న బోన్ ఫిక్స్‌వైపు బాలురు, యువకులు మొగ్గు చూపుతున్నారు. మందు తాగాలంటే గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, తినటానికి చిరుతిండి అంత హంగామా అవసరం. అదే బోన్‌ఫిక్స్, నల్లప్లాస్టిక్ క్యారీబ్యాగ్ ఉంటే చాలు మత్తుతో స్వర్గం అంచుల్లో తేలిపోవచ్చునని యువత ఎగబడి కొంటున్నారు. నల్లక్యారీబ్యాగ్‌లో బోన్‌ఫిక్స్ వేసి గాఢంగా ముక్కుతో పీల్చి ప్రమాదకరరీతిలో మత్తును ఆస్వాదిస్తున్నారు. అలా రోజుకు రెండు, మూడుసార్లు మండలంలోని మారుమూల ప్రదేశాలైన కృష్ణానది ఒడ్డున, జగనన్న కాలనీలలో, రియల్ ఎస్టేట్ వెంచర్‌లలో బాలురు, యువకులు గుంపులుగా చేరి అందులో వచ్చే మత్తును అనుభవిస్తున్నారు.
అత్యంత చవకగా..
రెండేళ్ల క్రితం బోన్‌ఫిక్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన ఏర్పరచటానికి పోలీసుశాఖ మండల కేంద్రమైన అమరావతిలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అదేవిధంగా షాపులలో బోన్‌ఫిక్స్ అమ్మకాలపై పలు షరతులు విధించారు. దీనివల్ల కొంత కాలం అమ్మకాలు తగ్గాయి. అయితే ప్రస్తుతం విక్రయాల జోరు మళ్లీ పెరిగింది. గతంలో రోజుకు 10 నుంచి 15 బోన్‌ఫిక్స్ ట్యూబులు అమ్ముడుపోవడమే గగనమవగా.. నేడు మండలంలో 800 నుంచి 1000 వరకు బోన్‌ఫిక్స్ ట్యూబులు అమ్ముడు పోతున్నట్లు సమాచారం. రూ.12 మాత్రమే ఉండే 10 గ్రాముల బోన్‌ఫిక్స్‌ను వ్యాపారులు ఇదే అదనుగా రూ.25 వరకు అమ్ముతున్నారు.
ఆరోగ్యంపై పెనుప్రభావం
బోన్‌ఫిక్స్‌ను పీల్చడం వల్ల ఆరోగ్యంపై పెనుప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులోని రసాయనాల గాఢత వల్ల నరాల బలహీనత, జీర్ణశక్తి తగ్గిపోవడం, బరువు తగ్గిపోయి బాలురు, యువకులు నిరసించి పోతున్నారు. అంతేకాకుండా ఒకసారి ఇది తీసుకున్న తర్వాత మళ్లీమళ్లీ తీసుకోవాల్సిన వ్యసనంలోకి వీరంతా మారుతున్నారు. ఈ ఉత్ప్రేరకాన్ని తీసుకుని మత్తులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సైతం పాల్పడి అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని బాలురు, యువతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment