రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడమేనని అదనపు ఎస్పీ జేవీ సంతోష్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రోడ్డు సేఫ్టీ ఎన్‌జీఓ కన్వీనర్ బీకే దుర్గాపద్మజ రూపొందించిన ప్రచార రథాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఇతర వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించేటప్పుడు లైన్ డిసిప్లేన్ పాటించాలని సూచించారు. జిల్లా రవాణా అధికారి ఎ.సంజీవకుమార్, ట్రాఫిక్ సీఐ సీహెచ్ లోకనాథం, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఎంఎల్.వంశీకృష్ణ, ట్రాఫిక్ ఎస్‌ఐ వేణు, రోడ్డుసేఫ్టీ సభ్యులు బంగారయ్య పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ జేవీ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment