పరిసరాల పరిశుభ్రత ముఖ్యం
నరసరావుపేట: ప్రతి ఉద్యోగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛత దివస్–స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు చేత పరిసరాలు పరిశుభ్రం చేయించారు. అనంతరం పచ్చదనం పెంపొందించే చర్యలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి నెల మూడో శనివారం విధిగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మురళి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి భానుకీర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేశారు.
రేపటి నుంచి పశువైద్య శిబిరాలు
నరసరావుపేట రూరల్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్న పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే తెలిపారు. తన కార్యాలయంలో శనివారం పశువైద్య శిబిరాల పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.కాంతారావు, ఏడీ రామచంద్రరావు, పశువైద్యులు శ్రీధర్, వంశీ, సాయిమహేష్‌రెడ్డి, అర్జున్, శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. డాక్టర్ కె.కాంతారావు వివరాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో అన్ని పశువులకు పశువైద్యులతో పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్యంతో పాటు తేలికపాటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. గర్భకోశ వ్యాధులకు పరీక్షలు జరిపి వైద్యం అందిస్తారని తెలిపారు. శిబిరాలలో పశువులతో పాటు చిన్న దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు ఉచితంగాతాగిస్తారని పేర్కొన్నారు. దీంతో వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తారని వివరించారు. ఆరోగ్య శిబిరాలలో 65 జట్లుగా పశువైద్య సిబ్బంది పాల్గొని సేవలు అందిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే
Comments
Please login to add a commentAdd a comment