కార్యకర్తల సమస్యలు తెలుసుకున్న పీఆర్కే
మాచర్ల: మాచర్ల పట్టణానికి శనివారం వచ్చిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శనివారం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. పీఆర్కే రాకను తెలుసుకున్న పలువురు ఆయా మండలాల నుంచి తరలివచ్చి ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్కేను కలిసేందుకు పలు ప్రాంతాల నుంచి మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల వారు తరలిరావటంతో కార్యాలయంలో సందడి నెలకొంది.
వలంటీర్ల నిర్బంధం ప్రజాస్వామ్యానికే కళంకం
నరసరావుపేట: వలంటీర్లకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చమని ఒత్తిడి తెచ్చేందుకు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యానికే పెద్ద కళంకమని ఏపీ గ్రామ, వార్డు వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పాలకులు అంటే ప్రజలకు సేవకులని, ముఖ్యమంత్రి పైమెట్టు సేవకుడైతే, వలంటీర్లు అట్టడుగున పేద ప్రజానీకానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సవ్యంగా, శీఘ్రంగా అందించే చివరి మెట్టు సేవకులని అన్నారు. ఇంతటి కీలకపాత్ర పోషించినందుననే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అట్టి ముఖ్యమైన వ్యవస్థను, అందులోనూ పేద నిరుద్యోగ యువతీ, యువకులకు సంబంధించిన అంశాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, వాగ్దాన భంగానికి పాల్పడటం, ఈ ప్రభుత్వ పతనానికి కారణం కాగలదని హెచ్చరించారు. రూ.10 వేలు ఇవ్వకపోయినా, రూ.5వేలు ఇచ్చినా చాలని, మా చిరు ఉద్యోగాలు మాకు ఇవ్వండని, బకాయి పడిన వేతనాలు ఇవ్వండని, ఆత్మహత్యలను ఆపండంటూ వారు చేస్తున్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంటనే మన్నించాలని డిమాండ్ చేశారు. రెండున్నర లక్షల మందిని విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కావాలంటే పేరు మార్చి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా సగర్వంగా చాటు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇంకా జాప్యం చేస్తే, ఈ యువజన ఉద్యమం మరింత తీవ్రమవుతుందని కూటమి నేతలు గుర్తెరగాలని కోరారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
● జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి
నరసరావుపేట: పర్యావరణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లుగా పెంచి ఆక్సిజన్ లభ్యతను పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పేర్కొన్నారు. వరల్డ్ అగ్రి ఫారెస్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్టు ఇన్ ఇండియా(టోపీ) కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికేట్లు అందజేసే కార్యక్రమం శనివారం మున్సిపల్ అతిథి గృహంలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మురళీ మాట్లాడుతూ దేశంలో ఉన్న భూ విస్తీర్ణంలో 30 శాతం అటవీ ప్రాంతం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ కోసం వెంపర్లాడిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. మొక్కలు నాటి చెట్లుగా పెంచటమనేది ఒక సోషల్ యాక్టివిటీగా మారాలని కోరారు. ఉద్యానవన జిల్లా అధికారి సీహెచ్.వి.రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఉద్యానవనం, ఫారెస్టు, అగ్రికల్చరల్ విభాగాలకు భాగస్వామ్యం ఉందన్నారు. రైతులకు పంటలతో పాటు వివిధరకాల మొక్కలను సైతం పెంచాలని శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్లు అభినందనీయులని అన్నారు. ఫారెస్టు రేంజ్ అధికారి డి.వెంకటరమణ మాట్లాడుతూ అడవి బయట ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలనే దృక్పధం నేటి పరిస్థితుల దృష్ట్యా చాలా అవసరమని పేర్కొన్నారు. అనంతరం రైతులకు శిక్షణ ఇచ్చిన 48 మంది మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ బాలూనాయక్, స్టేట్ అసోసియేట్ ప్రణీత్ వర్మ, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు మణికంఠ, ప్రవీణ్ పాల్గొన్నారు.
రూ.5వేల వేతనమైనా చాలు, వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండి వలంటీర్ల సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారు ఈదర గోపీచంద్
Comments
Please login to add a commentAdd a comment