సబ్‌జైల్‌లో న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ
గురజాల: సబ్‌జైల్‌ను మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 10వ అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జైలులో ఎవరైనా కుల వివక్షకు గురవుతున్నారా...? కులం పరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. కుల పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఖైదీలు న్యాయసేవాధికార సంస్థ హెల్ప్ లైన్ నెంబరు 15100కు ఫోన్ చేయాలన్నారు. వెంటనే సత్వర న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం స్టోర్ రూమ్‌లో గల ఫిర్యాదు బాక్స్‌లను పరిశీలించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అలేఖ్య, ప్రభుత్వ వైద్యుడు సాయి కర్ణ కుమార్ యాదవ్, న్యాయవాది కె.ప్రభుదాసు, సబ్‌జైలర్ సీహెచ్‌వీఎన్ సుబ్బారెడ్డి తదితరులున్నారు.
మిర్చి పంట పరిశీలన
అచ్చంపేట: పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గి, మద్దతు ధరలేక, భరోసా రాక, తెగుళ్లబారిన పడి దిగాలు పడ్డ రైతన్నల దుస్థితిపై ‘నల్లిగిపోతున్న మిర్చి రైతులు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉద్యాన శాఖాధికారిణి శ్రీనిత్య స్పందించారు. పెదపాలెం, నీలేశ్వరపాలెం, కొత్తపల్లి, అచ్చంపేట గ్రామాలలో మిర్చి పంటలను పరిశీలించారు. తెగుళ్లు ఉన్నట్లు గమనించారు. నల్లి, ఎర్రనల్లి, నల్లతామర తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన సూచనలను రైతులకు వివరించారు. గత యేడాదికన్నా దిగుబడులు తగ్గడానికి కారణాలను వివరించారు. మద్దతు ధర నిర్ణయించాల్సింది ప్రభుత్వమని తమ పరిధిలో ఉండదన్నారు. మితిమీరి మందులు వాడొద్దని, వాడినందువల్ల పెట్టుబడులు పెరుగుతాయే తప్ప దిగుబడులు పెరగవని చెప్పారు. ఆమెతోపాటు రైతు సేవా కేంద్రం సిబ్బంది నాగమణి, ఎనోష, మణి, రాంకుమార్, రైతులు పాల్గొన్నారు.
గిట్టుబాటు ధర కల్పించండి
అచ్చంపేట: తెగుళ్లు బారిన పడిన మిర్చి దిగుబడులను గణనీయంగా కోల్పోయామని, పెట్టుబడులు బాగా పెరిగాయని, మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని రుద్రవరం మిర్చి రైతులు శనివారం నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన తాను ఇప్పటికే ఈ విషయం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లానని మరొక్కసారి సీఎంతో మాట్లాడి మద్దతు ధర ప్రకటించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
చోరీ జరిగిన ఇళ్లను
పరిశీలించిన ఎస్పీ
గురజాల: ఈనెల 15వ తేదీన గురజాలలో దొంగతనం జరిగిన ఇళ్లను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఆచంట శ్రీనివాసరావు, శేషయ్య ఇళ్లలో జరిగిన దొంగతనం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఇళ్లల్లో ఎవరూ లేకుండా ఉండాల్సివస్తే ఎల్‌హెచ్‌ఆర్‌ఎం యాప్‌ను ఉపయోగించుకోవాలన్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ జగదీష్, సీఐ ఆవుల భాస్కర్, ఎస్‌ఐ వినోద్ కుమార్‌లు ఉన్నారు.
లక్ష్మీ నరసింహస్వామికి
రూ. 55,78,843 ఆదాయం
మంగళగిరి (తాడేపల్లి రూరల్): మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధి, దిగువ సన్నిధి, శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం హుండీల లెక్కింపును శనివారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో లెక్కించారు. మొత్తం ఆదాయం రూ. 55,78,843 వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి వెల్లడించారు. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఎగువ సన్నిధిలో రూ. 24,87,319, దిగువ సన్నిధిలో రూ. 29,93,901, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో రూ. 62,250, అన్నదాన సత్రంలోని హుండీ ద్వారా రూ. 33,373 వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది రూ. 5,71,509 అధికంగా వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment