ప్రజలకే కష్టం!
రాబడే ముఖ్యం..
కూటమి ప్రభుత్వం ధన దాహానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి తెస్తుండటంతో అదనపు భారం భరించలేక గురువారం,శుక్రవారం క్రయవిక్రయదారులు క్యూ కట్టారు. కనీస వసతులు లేక, సర్వర్లు మొరాయించడంలో నానా ఇబ్బందులకు గురయ్యారు.
క్రయవిక్రయదారులతో రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకొన్న రద్దీ
నరసరావుపేట టౌన్: క్రయవిక్రయదారులతో నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయం శుక్రవారం కిక్కిరిసింది. శనివారం నుంచి కూటమి ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. గత నాలుగు రోజుల నుంచి రాత్రి 9 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. దీంతో కార్యాలయం వద్ద క్రయవిక్రయదారులు, వారి సహాయకులతో రద్దీ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల మార్కెట్ విలువలను అమాంతం పెంచింది. ఎటువంటి హేతుబద్ధీకరణ లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భూములపై 50 శాతం వరకు పెంచారు. ఈ వ్యవహారంపై ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో జనవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెంచుతూ జీవో ఇచ్చినప్పటికీ వాయిదా వేసి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. పెంచిన మార్కెట్ విలువల నుంచి తప్పించుకునేందుకు ముందుగానే కొందరు రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు. రోజూ కార్యాలయానికి వచ్చే క్రయవిక్రయాలదారుల కంటే రెండు రోజులుగా వచ్చిన వారు రెండింతలు ఎక్కువని కార్యాలయాల వర్గాలు చెబుతున్నాయి. నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో సగటున రోజూ 100 రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయింది. సర్వర్ మొరాయించటంతో రిజిస్ట్రేషన్‌లకు ఆటకం కలిగింది. గంటలకొద్దీ క్రయవిక్రయదారులు కార్యాలయంలో వేచి ఉన్నారు. కనీస వసతులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కూటమి సర్కార్ తీరుతోక్రయవిక్రయదారుల అవస్థలు భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఫలితంగా రద్దీ కిక్కిరిసిన రిజిస్ట్రార్ కార్యాలయం మొరాయించిన సర్వర్లు అదనపు భారం భరించలేక క్యూ కట్టిన జనం
Comments
Please login to add a commentAdd a comment