సాక్షి ప్రతినిధి, విజయనగరం:
అధికార పార్టీ: సాలూరు నుంచి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, కురుపాం నుంచి మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ నుంచి విశ్వాసరాయి కళావతి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నలుగురూ రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతారని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విస్పష్టంగా ప్రకటించారు. పార్టీ నిర్ణయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
ప్రతిపక్షాలు: టీడీపీ, జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయంటూ ఆ పార్టీల నాయకులు ప్రకటించడంతో ఇరుపార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. జనసేనతో పొత్తు దృష్ట్యా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనని టీడీపీ నాయకులు బేజారైపోతున్నారు. సాలూరు సీటు ఆర్‌పీ భంజ్‌దేవ్‌కా లేదంటే గుమ్మడి సంధ్యారాణికా? పార్వతీపురంలో పోటీ చేసేది బొబ్బిలి చిరంజీవులా? లేదంటే ఇటీవలే వచ్చిన విజయచంద్రా? కురుపాం సీటు జూనియర్ నాయకురాలు తోయక జగదీశ్వరికా? లేదంటే ఆమె ప్రత్యర్థి వర్గం తాడంగి లావణ్యకా? బిడ్డిక తమ్మనదొరకా? ఆర్‌ఎస్‌ఎస్ విజయ్‌కుమార్‌కా? బూపతి మాస్టారికా? పాలకొండలో మళ్లీ నిమ్మక జయకృష్ణకే సీటు వస్తుందా? కొత్త నాయకురాలు పడాల భూదేవికి ఇస్తారా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. దీనికితోడు జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలో సీటు కేటాయిస్తారోనన్న ఆందోళన వారిలో నెలకొంది.
ఉత్సాహంగా బరిలోకి...
నాలుగుసార్లు వరుసగా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించడానికి సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, మా నమ్మకం నువ్వే జగన్ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి వై. ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేంద్రీ య గిరిజన విశ్వవిద్యాలయం భూమిపూజ, బహి రంగ సభకు అనూహ్యంగా ప్రజలు తరలిరావడం రాజన్నదొరలో మరింత ఉత్సాహాన్ని నింపింది. గిరిశిఖర గ్రామాల్లోనూ అర్హులందరికీ నవరత్నాల పథకాలను అమలు చేయడం, వైద్య సౌకర్యాలను మెరుగుపరిచి మాతాశిశు మరణాల సంఖ్యను కనిష్టస్థాయికి తీసుకురావడం, గిరిజనులకు భారీఎత్తున ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ, మారుమూల గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం... ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా కావడం కూడా రాజన్నదొరకు కలిసొచ్చే అంశం.
ప్రగతి పథం.. విజయపథం
జిల్లా కేంద్రమైన పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో అలజంగి జోగా రావు ముందున్నారు. నవరత్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడమే గాక నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేనివిధంగా మారుమూల పల్లెలకూ తారురోడ్లనూ నిర్మించి ప్రజలకు చేరువయ్యారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో పార్వతీపరం మన్యం జిల్లాకు ఆగస్టు నెలలో వచ్చిన చంద్రబాబు... పార్వతీపురంలో బహిరంగసభ పెట్టి అబద్ధాలు చెప్పారు. ఆ సభకు వచ్చిన జనాభాకు పదిరెట్లు జనసమీకరణతో అదే ప్రాంతంలో భారీ బహిరంగసభ పెట్టిన అలజంగి జోగారావు... చంద్రబాబు అబద్ధాలను రుజు వులతో ఎండగట్టారు. అదే రీతిలో పార్వతీపురంలో ఏ కార్యక్రమం జరిగినా జనసందోహమే కనిపిస్తోంది. ఆయన వెంట నడిచేందుకు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు ఉత్సుకత చూపుతున్నారు.
గిరిజనులతో నిత్యం మమేకం
అమ్మఒడి నాలుగో సంవత్సర నిధుల విడుదల సందర్భంగా కురుపాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో జరిగిన బహిరంగసభ భారీస్థాయిలో విజయవంతం కావడం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పనితనానికి అద్దం పట్టింది. కురుపాం నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా, గతంలో గిరిజన శాఖ మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం గిరిజనులతో మమేకమవుతూ మరింత చేరువయ్యారు. రానున్న ఎన్నికల్లో మూడోసారి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. వై.ఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తురాలిగా పేరొందిన ఆమె విజయం సునాయమే అన్నది కురుపాం నియోజకవర్గ ప్రజల మనోగతం.
ముచ్చటగా మూడోసారి విజయం కోసం..
విశ్వాసరాయి కళావతి కూడా హ్యాట్రిక్ సాధించేందుకు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను, ఆస్పత్రులను నియోజకవర్గానికి తీసుకురావడంతో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మొత్తంమీద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎంతో ఉన్నతిని సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment