డ్రైవర్ సజీవ దహనం
పూసపాటిరేగ: భోగాపురం మండలం నారుపేట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఇసుక లారీని వ్యాన్ వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆయిల్‌ట్యాంకర్ పేలి వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాన్ క్యాబిన్‌లో చిక్కుకున్న రెండవ డ్రైవర్(క్లీనర్) కాళ్లు ఇంజన్‌లో చిక్కుకుపోవడంతో మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్ వెళ్తున్న వ్యాన్ భోగాపురం మండలం నారుపేట సమీపంలో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీని బలంగా వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్ ఆయిల్ ట్యాంకర్ పేలి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, వ్యాన్‌లో ఉన్న మరో డ్రైవర్ (క్లీనర్) షేక్ అరీఫ్ కాళ్లు ఇంజిన్‌లో చిక్కుకు పోవడంతో ప్రమాదం నుంచి బయటపడలేకపోయాడు. రక్షించండంటూ హాహాకారాలు పెట్టినా ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. మంటలను అదుపుచేయలేకపోవడంతో అందరూ చూస్తుండగానే సజీవదహనమయ్యాడు. పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక యంత్రం వస్తే డ్రైవర్ ప్రాణాలు నిలిచేవని స్థానికులు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం ఎస్‌ఐ సూర్యకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భయపెడుతున్న ప్రమాదాలు
భోగాపురం నుంచి రాజాపులోవ మధ్య వరుసగా ప్రమాదాలు జరగడంతో వాహన చోదకులు హడలిపోతున్నారు. గతవారం రోజుల కింద అక్కడకు కొద్ది దూరంలో కారు బోల్తా కొట్టడంతో శ్రీకాకుళం పట్టణానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. ఇది మరువకముందే రోడ్డు ప్రమాదంలో అందరూ చూస్తుండగానే డ్రైవర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనం కావడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అగ్నిమాపక స్టేషన్ పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఏర్పాటు చేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, ప్రమాదాల సమయంలో ఆదుకునేవారే కరువయ్యారని స్థానికులు నిట్టూర్చుతున్నారు.
ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొన్న వ్యాన్
వ్యాన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం
నారుపేట సమీపంలో రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment