సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘మా బడి నాడు–నేడు’ కార్యక్రమంతో పాఠశాలలను ఎంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినదీ తాము ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పేరెంట్ టీచర్స్ సమావేశాలతో సచిత్రంగా చూపిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలను చూసి మెచ్చుకుంటున్నారని, అందుకు తామే చంద్రబాబుకు థాంక్స్ చెప్పాలని విద్యాశాఖ మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. హనీమూన్ పిరియడ్‌గా సంక్రాంతి వరకూ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని పట్టించుకోకూడదనుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో దగాపడుతున్న ప్రజలను చూసి ఉద్యమాలు చేయాల్సి వస్తోందన్నారు. గత చంద్రబాబు పాలనలో స్కూళ్లు ఎలా ఉండేవో, తర్వాత తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వెళ్లి కూర్చొని తెలుసుకున్నారని బొత్స గుర్తు చేశారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 మధ్యకాలంలో డిస్కమ్‌లకు మద్దతుగా సుమారు రూ.45,800 కోట్లు చెల్లించిందని, అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం 2014–19 కాలంలో ఇచ్చినది కేవలం రూ.15,300 కోట్లు మాత్రమేనని బొత్స సత్యనారాయణ అన్నారు. తమకు సంపద ఎలా సృష్టించాలో తెలుసంటూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆరునెలలవుతున్నా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టకుండా రామనామం మాదిరిగా రోజూ జగన్ జపం చేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు. భూదందాల వెనుక వైఎస్సార్‌సీపీ వారు ఉన్నారంటూ రోజూ పత్రికల్లో రాయించడం సిగ్గుచేటని, చేతిలో అధికారం ఉన్నప్పుడు విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. అది చేయకుండా చేతగాని ప్రభుత్వమని ఒప్పుకుంటున్నారా? చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విధానాలపై ఒకటీ రెండు రోజుల్లో ప్రభుత్వానికి మరో లేఖ రాస్తానని చెప్పారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment