అవస్థల్లో చెరకు రైతు
● ప్రోత్సాహం లేక కుంగుబాటు
● తగ్గిన సాగువిస్తీర్ణం
● 13 కొనుగోలుకేంద్రాలకు 7 మాత్రమే ప్రారంభం
ఈ ఏడాది చెరకు సాగువిస్తీర్ణం
(15 మండలాల పరిధి)
లచ్చయ్యపేట: 16,33 హెక్టార్లు,
భీమసింగి: 212.69 హెక్టార్లు,
సంకిలి: 4622.66 హెక్టార్లు
మొత్తం సాగు విస్తీర్ణం:
6468.55 హెక్టార్లు
గత ఏడాది మొత్తం సాగు విస్తీర్ణం:
9,472.03హెక్టార్లలో
13 కొనుగోలు కేంద్రాలు మంజూరు
సంకిలి ఫ్యాక్టరీకి చెరకును తరలించేందుకు 13 కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ,
డిప్యూటీ కేన్ కమిషనర్, బొబ్బిలి
బొబ్బిలి: తాము అధికారంలోకి వస్తే చెరకు ఫ్యాక్టరీలను తెరిపించి రైతులకు బతుకులు తీపిమయం చేస్తామని బూటకపు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం నేడు పత్తాలేకుండా పోయింది. ఇక్కడున్న కంపెనీలు తెరిపించడం మాట దేవుడెరుగు. దూరంగా చెరకు ఫ్యాక్టరీకి తరలించేందుకు అవసరమైన తూనిక కేంద్రాలు, రవాణా చార్జీలు కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో చెరకు రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో చెరకు ఫ్యాక్టరీలు రైతులను మోసం చేస్తే వారిఆస్తులను జప్తు చేసి ముక్కుపిండిమరీ రైతులకు నయాపైసాతో సహా చెల్లించారు. ఇలా వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు రూ.42.80 కోట్లను ఎన్‌సీఎస్ ఫ్యాక్టరీ పరిధిలో భూములను విక్రయించి బకాయిలను చెల్లించారు. రైతులకు సకాలంలో ప్రోత్సాహకాలు వచ్చేలా చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అయితే చెరకు క్రషర్లకు చెరకు తరలించుకునే సత్తా ఉంటే రైతులు పండిస్తున్నారు. లేని పక్షంలో మానుకుంటున్నారు. గతంలోనూ ఇప్పుడూ చెరకు సాగు గణనీయంగా తగ్గడమే దీనికి కారణమని చెప్పవచ్చు.
కొనుగోలు కేంద్రాలేవీ?
జిల్లాలో 13 కొనుగోలు కేంద్రాలకు ఆమోదముద్ర లభించింది. కానీ అమలులో ఉన్నవి కేవలం ఏడు లోపే. దీని వల్ల రైతులు మద్దతు ధరలేకుండా చెరకును క్రషర్లకు విక్రయించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. తూనిక కేంద్రాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో సుదూరంగా ఉన్న కేంద్రాలకు రైతులు వెళ్లాల్సి వస్తోంది. 15 మండలాల పరిధిలో 13 మాత్రమే తూనిక కేంద్రాలు మంజూరు చేసి అన్ని చోట్లా ఏర్పాటు చేయకపోవడం సరికాదని రైతులు విమర్శిస్తున్నారు.
అరకొరగా రవాణా చార్జీలు
తాము చెరకు తరలించే కేంద్రాల వరకూ అయ్యే ఖర్చును ఫ్యాక్టరీ యాజమాన్యమే భరించాల్సి ఉన్నా కేవలం అరకొరగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారని జిల్లాలోని చెరకు రైతులు వాపోతున్నారు. ఇక్కడి నుంచి సంకిలిలో ఉన్న ఈఐడీ ప్యారీ సుగర్స్ కంపెనీకి తరలించాలంటే దాదాపు 75 కిలోమీటర్ల దూరం. కానీ ఫాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు 35 కిలోమీటర్ల రవాణా చార్జీలు మీరే చెల్లించుకోవాలని చెబుతోంది. దీనివల్ల రవాణా చార్జీలు భారమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment