ప్రతి ఒక్కరూ హక్కులను తెలుసుకోవాలి
పార్వతీపురంటౌన్: సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్. దామోదరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ కళాశాలలో గల మృత్యుంజయ అడిటోరియంలో సెట్విజ్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారన్నారు. ప్రజలకు సంక్రమించిన హక్కులను దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాలని హితవు పలికారు. మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయన్నారు. ఆర్టికల్ 26 ప్రకారం ఒకరి హక్కులకు మరొకరు భంగం కలిగించకూడదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 29 విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరు ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకోవడానికి స్థానికత అవసరం లేదని, కుల, మత, ప్రాంత, భాషా భేదంతో ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చేర్చుకోమంటే చట్ట ప్రకారం శిక్షార్హులని పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని, లేకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. ఆర్టికల్ 39 ఇ ప్రకారం చిన్న పిల్లలను హింసించడం చట్టరీత్యా నేరమని, చట్టం ప్రతి చర్యను గమనిస్తుందని హక్కుల కోసం పోరాడేటప్పుడు బాధ్యతలు మర్చిపోకూడదని వివరించారు. ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం చిన్న పిల్లలను కొట్టడం నేరంగా పరిగణించి సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, అదనపు ఎస్‌స్పీ ఒ.దిలీప్ కిరణ్ మాట్లాడారు. సీనియర్ న్యాయవాది జోగారావు, సెట్విజ్ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూ అధికారి బి.రాంగోపాల్ వర్మ, ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.ఎం.ఎస్. స్వరూప్, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిటీ జనరల్ సెక్రటరీ పి.సంతోష్, కోచ్ అశ్విని, దినేష్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ సభ్యులు ఎం. అప్పారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెండవ అదనపు జడ్జి
ఎస్.దామోదరరావు
Comments
Please login to add a commentAdd a comment