మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన పెంచాలి
పార్వతీపురం: మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ టాయిలెట్ డే ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను అంతే శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన లోపం కారణంగా గ్రామాల్లో, సంతలు, దేవాలయాల చుట్టుపక్కల బహిరంగ మల విసర్జన జరగడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారు కావడంతోపాటు పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. స్థలాభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ద్వారా 7,500 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, డీపీఓ టి.కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment