జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు మెండుగా ఉండాలి
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు మెండుగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీ వాస్తవ సూచించారు. ఈ మేరకు మక్కువ మండలంలోని శంబర గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న రహదారి పనులను వచ్చే ఏడాది జనవరిలో జరుపుకోనున్న అమ్మవారి జాతరలోపు పూర్తిచేయాలని కోరారు. అనంతరం చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారి ఆలయంలో క్యూలను పరిశీలించారు. అలాగే నడిమివీధి విస్తరణ పనులు ఏ విధంగా చేపడుతున్నారో పరిశీలించి అధికారులను వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వనంగుడి రహదారి మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయని వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు సబ్ కలెక్టర్‌ను కోరారు. పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుపై ఏఎస్సై శ్రీనివాసరావుతో ఆయన చర్చించారు. పార్కింగ్‌ల ఏర్పాటు నివేదికను త్వరితగతిన అందజేయాలని సూచించారు. చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ ఇబ్రహీం, ఈవోపీఆర్‌డీ పి.దేవకుమార్, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, వైస్ సర్పంచ్ అల్లు వెంకటరమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment