సాలూరు: పాచిపెంట మండలంలోని చెరుకుపల్లి జంక్షన్ వద్ద వ్యాన్,బైక్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయని ఎస్సై వెంకటసురేష్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, పి.కోనవలస పంచాయతీ చెరుకుపల్లి జంక్షన్ వద్ద వ్యాన్, బైక్ ఢీకొనగా ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి, బైక్‌పై వెనుకన ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలవగా వారిని సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. క్షతగాత్రుల్లో ఆదిత్య అనే యువకుడిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఆటో ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
సాలూరు: పట్టణంలోని చినవీధికి చెందిన టి.రాము అనే మహిళ ఆటో ప్రమాదంలో తీవ్రగాయాలపాలైంది. ఈ ప్రమాదంపై సీఐ అప్పలనాయుడు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని లారీ యూనియన్ ఆఫీసువద్దకు పనినిమిత్తం ఆటోలో ఆ మహిళ వెళ్తుండగా డీలక్స్ సెంటర్ సమీపంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెంటనే ఆమె ఆటోలో నుంచి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో డ్రైవర్ చూసుకోకుండా ఆమెను ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకువెళ్లగా ఆటోలో ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఆటో ఆపాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రగాయాలవడంతో అదే ఆటోలో సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment