చౌకగా ఉపాధి
తమ్ముళ్లకు
సాక్షి, పార్వతీపురం మన్యం: చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులపై కూటమి నేతల కన్నుపడింది. ఎలాగైనా వీటిని దక్కించుకుని ‘తమ్ముళ్ల’కు ‘ఉపాధి’ చూపాలన్న లక్ష్యంతో తెర వెనుక పైరవీలు జోరుగా సాగిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సిఫారసు లేఖలుంటేనే డీలర్ పోస్టు ఇవ్వాలంటూ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. గతంలో రేషన్ డీలర్లు గ్రామాల్లో కీలకంగా ఉండేవారు. రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేసేవారు. గ్రామస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడం వల్ల రాజకీయ నాయకులూ వీరిని ప్రోత్సహించేవారు. మరోవైపు కొంతమంది డీలర్లు ప్రజాపంపిణీ వ్యవస్థను పక్కదారి పట్టించేవారన్న విమర్శలు బలంగా ఉండేవి. బియ్యం, పప్పులు, పంచదార వంటి సరుకులను నల్లబజారుకు తరలించేవారు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు.. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సరకులను నేరుగా అందించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి, విజయవంతం చేసింది. ఈ పథకం ద్వారా కొత్తగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలూ కల్పించింది. ఇదే సందర్భంలో ఏళ్లుగా ఉన్న డీలర్ల వ్యవస్థనూ కొనసాగించింది. ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదు. అక్రమాలకు అలవాటు పడిన కొంతమంది డీలర్లు మొదట్లో ఎండీయూ వాహన వ్యవస్థను వ్యతిరేకించినప్పటికీ.. నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
కూటమి ప్రభుత్వం రావడంతోనే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. వలంటీరు వ్యవస్థ, ప్రభుత్వం మద్యం దుకాణాలను ఇప్పటికే కనుమరుగు చేసింది. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేసింది. ఎండీయూ వాహనాలనూ రద్దు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఇటీవల కూడా మరోమారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని వాహనాలను రద్దు చేసి, రేషన్ డీలర్ల ద్వారానే సరకులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సేవ కంటే ఆదాయం వచ్చే మార్గం అధికంగా ఉండడంతో కూటమి నేతల కన్ను వీటిపై పడింది. కార్యకర్తలకు రాజకీయ ‘ఉపాధి’ చూపాలన్న లక్ష్యంతో పైరవీలు సాగిస్తున్నారు.
ఎండీయూ వాహనాలకు మంగళమేనా?
మన్యం జిల్లాలో 644 రేషన్ దుకాణాలు ఉండగా.. 2.81 లక్షల కార్డుదారులున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు 196 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసింది. నిరుద్యోగులకు జీవన భృతి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ వాహనాలకు బ్యాంకు రుణాలు సైతం ఇప్పించి, నెలవారీ గౌరవ వేతనం అందజేసేది. ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించడం.. గిరిజన ప్రాంతాల్లో వాహనాలను రద్దు చేయడం.. ఇప్పుడు డీలర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చూస్తుంటే... మున్ముందు ఎండీయూ వాహనాలను కొనసాగించే పరిస్థితి ఉండబోదని ఆయా వాహనదారులు వాపోతున్నారు.
పేరుకే రాత పరీక్ష...
పాలకొండ డివిజన్ పరిధిలోని 21 చౌక ధరల దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన డీలర్ పోస్టులను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భామిని మండలంలో 5, జియ్యమ్మవలస మండలంలో 3, కురుపాం–1, పాలకొండ– 5, వీరఘట్టం మండలంలో ఏడు డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్వతీపురం డివిజన్ పరిధిలో 36 చౌకధరల దుకాణాల డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు విధించారు. పాలకొండ డివిజన్‌కు సంబంధించి 23న పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ, పార్వతీపురం డివిజన్‌కు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ రాత పరీక్ష నిర్వహించి, 30వ తేదీన తుది ఫలితాలు ప్రకటించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులై.. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు వారు అర్హులుగా పేర్కొంటున్నారు. డ్వాక్రా గ్రూపుల వారూ దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. పంచాయతీ సభ్యులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, సర్పంచ్, కౌన్సిలర్, చైర్‌పర్సన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు దరఖాస్తు చేయడానికి అనర్హులుగా పేర్కొన్నారు. పేరుకే రాత పరీక్ష, నిబంధనలు అంటున్నారే గానీ.. వాస్తవానికి ఎప్పుడో ఆ ఖాళీలపై ‘తమ్ముళ్లు’ కర్చీఫ్ వేసేశారని ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినిపిస్తోంది. ప్రయత్నం చేసుకున్నా ఫలితం ఉండదని కూటమి పార్టీల కార్యకర్తలు ముందుగానే చెప్పేస్తున్నారని.. ఒక వేళ పోస్టు కావాలన్నా, తాము అడిగినంత మొత్తం ఇవ్వాలన్న డిమాండ్‌ను వినిపిస్తున్నారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment