రాయగడ సమీపంలోని సింగపూర్ రోడ్డు వద్ద నిర్మించనున్న పొడవైన రైల్వే ప్లైఓవర్ ఊహాచిత్రం
విజయనగరం–రాయ్‌పూర్ రైల్వేలైన్‌కు మహర్దశ
సింగపూర్ రోడ్డు వద్ద 5.5 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్
రూ.240 కోట్లతో నిర్మాణానికి రైల్వే బోర్డు పచ్చజెండా
ఉమ్మడి విజయనగరం జిల్లాకు మరిన్ని ప్యాసింజర్ రైళ్లు వచ్చే అవకాశం
గూడ్స్ రాకపోకలకు మరింత వెసులుబాటు
ఇప్పటికే పార్వతీపురం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వాల్తేరు డివిజన్‌లో కీలకమైన విజయనగరం–రాయ్‌పూర్ రైల్వే లైన్ మరింత ఆధునికీకరణ దిశగా సాగుతోంది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ.240 కోట్లతో 5.5 కిలోమీటర్ల పొడవున రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. రాయగడ సమీపంలోని సింగపూర్ రోడ్డు వద్ద అటు కోరాపుట్ లైన్, ఇటు విజయనగరం లైన్‌లో వచ్చే రైళ్లు క్రాసింగ్‌కు ఇన్నాళ్లూ ఉన్న ఇబ్బందులు ఫ్లైఓవర్‌తో తొలగిపోనున్నాయి. కొన్ని గంటల విలువైన సమయం కలిసి వస్తుంది. తద్వారా మరికొన్ని కొత్త ప్యాసింజర్ రైళ్లతో పాటు అదనంగా గూడ్స్ రైళ్లను నడిపే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ‘అమృత్ భారత్’ పథకంలో పార్వతీపురం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే విజయనగరం, పార్వతీపురం జిల్లా ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.
● అతి పొడవైన ఫ్లైఓవర్
విజయనగరం నుంచి పార్వతీపురం మీదుగా రాయ్‌పూర్ రైల్వే లైన్, రాయగడ–కోరాపుట్ లూప్ లైన్ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ సమీపంలోని సింగపూర్ రోడ్డు వద్ద క్రాస్ అవుతాయి. దీంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. రైళ్ల క్రాసింగ్‌కు చాలా సమయం పడుతోంది. దీనికి పరిష్కారంగా రైల్వే ఫ్లైఓవర్ నిర్మించాలనే ప్రతిపాదన దీర్ఘకాలంగా ఉంది. ఎట్టకేలకు దీనికి మోక్షం కలిగింది. సుమారు 5.5 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్‌ను రూ.240 కోట్లతో నిర్మించడానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
పొడవైన ఫ్లైఓవర్ గొప్ప ముందడుగు...
వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఎనర్జీ, మినరల్స్, సిమెంట్ కారిడార్‌గా పేరొందిన విజయనగరం–రాయ్‌పూర్ రైల్వే లైన్‌లో రూ.240 కోట్లతో 5.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే ఫ్లైఓవర్ ప్రాజెక్టు గొప్ప ముందడుగు. ఈ లైన్‌లో మౌలిక వసతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లకు ఇదొక పరిష్కారం చూపిస్తుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఉండదు. మరిన్ని కొత్త రైళ్లను నడిపేందుకు వెసులుబాటు కలుగుతుంది. – మనోజ్‌కుమార్ సాహూ, డీఆర్‌ఎం, వాల్తేరు డివిజన్
వాల్తేరు డివిజన్ జోరు...
సింగపూర్ రోడ్డు వద్ద 5.5 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను 2027 నాటికల్లా పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇది పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ తగ్గుతుంది. పాసింజర్ రైళ్లు మరిన్ని నడపడానికి వీలు అవుతుంది. ఇప్పటికే విజయనగరం–రాయ్‌పూర్ లైన్‌లో 25 నుంచి 35 ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. మరో ఐదు వరకూ పెంచుకొనే వెసులుబాటు కలుగుతుంది. కోరాపుట్–రాయగడ–సింగపూర్ రోడ్డు జంక్షన్ అనుసంధాన ప్రక్రియను ఈ సుదీర్ఘ ఫ్లైఓర్ సులభతరం చేస్తుంది. తద్వారా గూడ్స్ రైళ్లతో పలు ఖనిజాలు, సిమెంట్ రవాణా మరింత పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment