నీటి సంఘాల ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో నిర్వహించాలి
● మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి
వీరఘట్టం: జిల్లాలో ఈనెల 14న జరగనున్న నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను రహస్య ఓటింగ్ పద్ధతిలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కోరారు. వండువలో ఆమె మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఈ ఎన్నికలను చేతులెత్తే విధానంలో నిర్వహిస్తే కూటమి నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తారని, సీక్రెట్ ఓటింగ్ నిర్వహించేలా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ చొరవ చూపాలని కోరారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
13న కురుపాంలో మినీ జాబ్‌మేళా
పార్వతీపురం: కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 13న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమో, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్లలోపు వయస్సుగల నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల యువత హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఒక ఫొటోతో జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్:63034 93720 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
బీసీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
కొత్తవలస: మండల కేంద్రంలోని కోటపాడు రోడ్డులో ఉన్న బీసీ బాలికల సంక్షేమ వసతి గృహం వార్డెన్ నీరజకుమారిని సస్పెండ్ చేసినట్టు జిల్లా బీసీ సంక్షేమ సహాయాధికారి యశోధనరావు మంగళవారం తెలిపారు. వార్డెన్ వేధిస్తోందంటూ స్థానిక పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థులు సోమవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వార్డెన్ తీరుపై విచారణ జరపగా విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో కొన్ని నిజమని తేలిందని, కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. హాస్టల్‌కు ఇన్‌చార్జి వార్డెన్‌గా కొత్తవలస ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గేదెల పద్మను నియమించినట్టు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా తన ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేయాలని సూచించారు.
నిబంధనల మేరకు రుణాలు
తెర్లాం: రైతులకు పంట రుణాలు, ఇతర రుణాలు మంజూరు చేసేటప్పుడు బ్యాంకు అధికారులు విధిగా నిబంధనలు పాటించాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) బి.వి.రమణమూర్తి అన్నారు. తెర్లాం మండల పరిషత్ సమావేశ భవనంలో మంగళవారం నిర్వహించిన సంయుక్త మండల స్థాయి బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పంట రుణాలు మంజూరు చేసినప్పుడు రైతులు తమ పొలాల్లో ఏ పంటను సాగుచేస్తున్నారో పరిశీలించాలన్నారు. తప్పుగా నమోదుచేస్తే పంటల బీమా వర్తింపజేసే సమయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఏయే వ్యాపారాలు చేస్తున్నారో చూసి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. బోగస్ సంఘాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాల రికవరీ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో తెర్లాం ఎస్‌బీఐ మేనేజర్ ఆదిత్య, మండల వ్యవసాయ అధికారి సునీల్‌కుమార్, వెలుగు ఏపీఎం రాము, తెర్లాం, పెరుమాళి, గలావల్లి గ్రామీణ బ్యాంకు, ఐఓబీ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ, మత్స్యకార శాఖల అధికారులు పాల్గొన్నారు.
● ప్రమాదకర ప్రయాణం
విజయనగరం జిల్లా కేంద్రంలోని వీటీ అగ్రహారం రైల్వే గేటు వద్ద వాహనచోదకులు, పాదచారులు ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే ట్రాక్‌ను దాటే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గేటు వేసి ఉన్నా, రైలు నిలిపి ఉన్నా ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి మంగళవారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం.
– సాక్షి ఫొటో గ్రాఫర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment